Cab Theft Case in Pathancheru : క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌నని చెప్పాడు.. బిర్యానీ తెమ్మని చెప్పి కారు దొంగిలించాడు...
Cab Theft Case in Pathancheru : ఓ వ్యక్తి సినిమా మాదిరిగా సీన్ క్రియేట్ చేసి.. కారును దొంగిలించాడు. క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి తాను క్రైం బ్రాంచ్ పోలీస్‌నని చెప్పి.. హైదరాబాద్‌లో దించాలని కిరాయి మాట్లాడుకున్నాడు. మార్గం మధ్యలో హోటల్ దగ్గర ఆపి క్యాబ్ డ్రైవర్ని బిర్యాని తెమ్మని చెప్పాడు. దీంతో డ్రైవర్ బిర్యాని తెచ్చేలోపు.. నిందితుడు కారుతో సహా ఉడాయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ తన కారును జహీరాబాద్‌లో కిరాయికి నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని దగ్గరకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్లో పని ఉందని.. కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. వివరాలు అడగగా.. మహారాష్ట్రకు చెందిన క్రైం బ్రాంచ్ పోలీస్‌గా పరిచయం చేసుకున్నాడు. దీంతో సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్ ముందు ఆపి లోపలికి వెళ్లి వచ్చాడు. దీంతో పాటు ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లి అక్కడ ఫోన్ మాట్లాడాడు. ఇవన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ నిందితుడు నిజంగానే పోలీస్ అని నమ్మేశాడు. అనంతరం నిందితుడు తనను హైదరాబాద్‌లో దింపాలని డ్రైవర్‌కి చెప్పాడు. దీనికి అదనంగా రూ.3వేలు ఇవ్వాలని నరేష్ కోరితే.. ఇస్తానని చెప్పాడు.
Car Theft Cases in Hyderabad : హైదరాబాద్ వస్తున్న మార్గంలో పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో ఉన్న హోటల్ దగ్గర కారు ఆపి.. డ్రైవర్ని బిర్యాని తీసుకురమ్మని పంపించాడు. దీంతో బాధితుడు బిర్యానీ తెస్తే.. మరో మూడు బిర్యానీలు తెమ్మని రూ.1000 ఇచ్చాడు. డ్రైవర్ ఈసారి హోటల్లోకి వెళ్లి.. బిర్యానీ తెచ్చే లోపు నిందితుడు కారుతో సహా పరారైయ్యాడు. దీంతో షాక్‌కు గురైన డ్రైవర్ తమ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్‌లో తన కారు ఎక్కడైనా ఉంటే తెలియజేయాలని సందేశాన్ని షేర్ చేశాడు. సికింద్రాబాద్‌లో చూసామని.. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తోటి క్యాబ్ డ్రైవర్లు(Cab Theft) చెప్పారు. దీంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జహీరాబాద్‌లో ఉన్న హోటల్ గది కోసం ఇచ్చిన ఆధార్ కార్డు వివరాల ఆధారంగా అభినాష్ ప్రకాష్ షిండే అని పోలీసులు గుర్తించారు.