'ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి.. ఎందుకు సుప్రీంను ఆశ్రయించారు?'
ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేయడాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుపట్టారు. ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి.. ఎందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్ కోర్టుకు వెళ్లి ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టే తెచ్చుకున్నారని ఆనాడు బీఆర్‌ఎస్ నేతలు అన్నారు కదా.. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుకు వెళ్లి ఏం చేసిందని ప్రశ్నించారు.
''మహిళను ఈడీ ఆఫీస్‌కు పిలుస్తున్నారు.. మహిళను కాబట్టి నాకు కొంచెం మినహాయింపు ఇవ్వాలన్నారని ధ్వజమెత్తారు. మొన్ననే విచారణను ఎదుర్కొంటాం అని ప్రగల్భాలు పలికిన.. నేతలు ఇప్పుడు కోర్టు కూడా స్టే ఇవ్వలేదని.. మీకో రూలూ.. మందికో రూలా'' అని ఎద్దేవా చేశారు. మళ్లీ రేపు తెలంగాణను విడిచిపెట్టి మంత్రులు అందరూ వస్తారా అని ధ్వజమెత్తారు. మహిళలకు రిజర్వేషన్లు అని రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు కవిత నిర్వహించారు. మరి సీఎం కేసీఆర్ ఎంత మంది మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి కేబినెట్లో ఉంచారని మండిపడ్డారు. తర్వాత ఎన్నికలో వచ్చేది బీజేపీనే అని ప్రజలు అందరూ తమవైపే ఉన్నారని చెప్పారు.