'ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగింది'
Published : Nov 17, 2023, 10:44 PM IST
BJP Leaders on Dharani Portal :ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగిందని.. ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం ఇదని.. లక్షల మంది రైతులు ధరణి కారణంగా తమ విలువైన భూమిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఓట్లు పొందాలనే తప్ప.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీ చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. తెలంగాణను ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఆత్మబలిదానాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం చెబుతున్నారన్నారు. తెలంగాణ ఇస్తానని వెనకడుగు వేయడంతో.. 12వందల మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారన్నారు.