మనిషితో కొంగ స్నేహం.. ఒక్క పిలుపుతో వచ్చేస్తున్న పక్షి.. ఏడాది నుంచి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మనిషితో స్నేహం చేసిన కొంగ కథ మీకు గుర్తుందా? అచ్చం అలాగే అదే రాష్ట్రంలో మరో వ్యక్తితో ఓ కొంగ స్నేహం చేస్తోంది. మౌ జిల్లాకు చెందిన రామ్సముజ్తో ఏడాది కాలంగా ఓ కొంగ కలిసిమెలసి ఉంటోంది. దాన్ని దూరం పెట్టేందుకు రాజ్‌సముజ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంగ మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాయ్పుర్ మాలిక్ గ్రామంలో రామ్‌సముజ్ నివసిస్తున్నాడు. ఏడాది క్రితం తన పొలంలో అతడికి ఓ కొంగ కనిపించింది. అస్వస్థతతో కిందపడిపోయి ఉన్న కొంగను దగ్గరికి తీసుకొని నీళ్లు తాగించి, తిండి పెట్టాడు. బలహీనంగా ఉన్న కొంగను కొద్దిరోజులు జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడి ప్రయత్నాల వల్ల కొంగ ఆరోగ్యంగా తయారైంది. అప్పటి నుంచి కొంగ తన వెంటే తిరుగుతోందని రామ్‌సముజ్ చెబుతున్నారు.
'మిగిలిన కొంగల గుంపులో దాన్ని వదిలేసేందుకు ప్రయత్నించా. కానీ కొంగ వెళ్లడం లేదు. ఒక్క పిలుపుతోనే కొంగ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని నాతోనే పెంచుకుంటున్నా. జాగ్రత్తగా చూసుకుంటున్నా. దాన్ని సంరక్షించాలన్న ఉద్దేశంతోనే పెంచుతున్నా. ఇప్పుడు అది నన్ను వదిలిపెట్టడం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తోంది' అని రామ్‌సముజ్ వివరిస్తున్నారు.
యూపీలోని అమేఠీలో ఆరిఫ్ అనే వ్యక్తితో కొంగ స్నేహం చేయడం ఇటీవల దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా ఆ కొంగ సైతం అతడి వెంటే వెళ్లేది. బైక్‌పై వెళ్తే.. ఎగురుకుంటూ అతడితో పాటు వచ్చేది. వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైందనే ఆసక్తికర కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. అయితే, ఆ కొంగ ఇప్పుడు ఆరిఫ్‌కు దూరమైంది. అధికారులు దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదివేసేయండి.