TSPSC పేపర్ లీకేజీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.. సీఎం రాజీనామాకు డిమాండ్ - టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా ఏబీవీపీ ధర్నా
ABVP dharna against TSPSC paper leakage : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వల్ల లక్షల మంది ఉద్యోగార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్కార్ కొలువుల కోసం రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన ఉద్యోగార్థుల బతుకులు గందరగోళమయ్యాయి. ఓవైపు క్వశ్చన్ పేపర్ లీకేజీ.. మరోవైపు పలు పరీక్షల రద్దుతో వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.
మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు ఆ సంస్థలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన పలువురు ఉద్యోగులను అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలు చాలా మంది చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై మండిపడుతున్నాయి. ముఖ్యంగా పేపర్ లీకేజీకి ఐటీ శాఖ నిర్వహణ లోపమే కారణమని ఆరోపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోవైపు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఏబీవీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. లీకేజీ ఘటనపై చర్యలు తీసుకోలేదంటూ ఆందోళనకు దిగారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ పీఎస్‌కు తరలించారు.