Blind Man: 'పాటలు పాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అంధుడు.. సాయం కోసం ఎదురుచూపు'
A Blind Man Singing Songs in Jagtial: పుట్టుకతోనే అంధుడైనా.. పొట్టకూటి కోసం పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆ యువకుడు. విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసినా.. ఆ యువకుడి గాత్రం మాత్రం ఆ కుటుంబాన్ని పోషిస్తోంది. చూపు లేకపోయినా యాచన చేస్తూ.. పాటలు పాడుతున్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన తూర్పాటి రవి. వీరు ఇద్దరు అన్నదమ్ములు. రవి అన్న గంగాధర్ కూడా పుట్టుకతోనే అంధుడు. కూలీనాలీ చేసుకుంటూ జీవించే కుటుంబంలో ఇద్దరు కుమారులు అంధులు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించేవారు. తండ్రి చిన్నయ్య మృతితో వీరి తల్లి నర్సమ్మ కుటుంబాన్ని పోషిస్తుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో కంజెర వాయిస్తూ జానపద గీతాలు, పాటలు పాడుతూ ఇద్దరు అన్నదమ్ములు భక్తులు సాయం చేస్తే కడుపు నింపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదువుకోకపోయినా పాటను ఒకసారి వింటే చాలు ఇట్టే పాడేస్తారు. రవి పాడే పాటలు సామాజిక మాధ్యమాల్లోనూ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అలాగే ఇటీవల విడుదలైన బలగం సినిమాలోని ‘అయ్యో రామ రామ బాలి’ పాటను రవి పాడుతూ కొన్ని రోజులుగా ఆకట్టుకుంటున్నాడు. కటిక పేదరికంలో ఉన్న రవికి ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. తనకు కనీసం ఆర్టీసీ బస్‌పాస్ కూడా లేదని, అధికారులకు విన్నవిస్తే దాట వేస్తున్నారని రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.