Olympic Day Run in Hyderabad : 'చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యం'
Olympic Day Run In Hyderabad : ఒలింపిక్ డే రన్ 37వ ఎడిషన్ హైదరాబాద్‌లో ఉత్సాహంగా సాగింది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఛార్మినార్ వద్ద ప్రారంభమైన పరుగు.. విక్టరీ ప్లేగ్రౌండ్, హనుమాన్ వ్యాయామశాల, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్ గూడా, బోయిన్పల్లి, హెల్త్ లీగ్, ఫతే మైదాన్ క్లబ్, సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వర విగ్రహం, నారాయణ వైఎంసీఏ, ఉస్మానియా యూనివర్సిటీ, హిమాయత్‌నగర్‌లోని వాసవి పబ్లిక్ స్కూల్, దిల్లీ పబ్లిక్ స్కూల్ల నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకుంది. ఒలింపిక్ డే రన్లో క్రీడాకారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ ముగింపు ఉత్సవంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలు... చదువుతో పాటు క్రీడలు నేర్చుకోవడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా సాహిత్యరంగంలో... వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను మంత్రులు ఘనంగా సన్మానించారు.