Pandugappa Fish: మత్స్యకారులకు పంట.. ఒక్క చేపకు భారీ ధర.. దీని రుచి మాత్రం..!
Pandugappa Fish in Yanam Market: వేసవికాలం అనంతరం వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు కురుస్తుండటం.. గోదావరి నీరు సముద్రంలో కలుస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంతం యానంలో గడిచిన వారం రోజులుగా మత్స్యకారుల వలలకు.. పండుగప్ప చేపలు లభ్యమవుతున్నాయి. రెండు రోజుల క్రితం 10 కేజీల చేప మార్కెట్లో వేలం వేయగా పదివేల రూపాయల ధర పలికింది. తాజాగా ఈరోజు భైరవపాలెం తీరంలో మత్స్యకారుల వలకు 25 కేజీల భారీ చేప చిక్కింది. దానిని మార్కెట్లో వేలం వెయ్యగా 17వేల 500 ధర రావడంతో మత్స్యకారుల పంట పండింది. ఈ చేపను పది లేదా పదిహేను వాటాలుగా కోసి చిల్లరగా అమ్ముతారు.. ఒక్కో వాటా సుమారు 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. వీటిని మాంస ప్రియులు తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు..
పండుగప్ప చేప అంటే ఏమిటి: చేప జాతిలో రారాజుగా పేరొందినది పండుగప్ప. ఇది సుమారు రెండు కేజీల బరువు నుంచి 10, 15, 25 కేజీల వరకూ ఒక్కోసారి 30 కేజీల వరకు మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి. సముద్రం నీరు గోదావరి నీరు కలిసే ప్రాంతంలో ఇవి ఎక్కువగా లభ్యమవుతుంటాయి. అందుచేత వీటి రుచి కూడా అమోఘంగా ఉంటుంది. సముద్రపు నీటితో పాటుగా మంచినీటిలో పెరిగే ఈ పండుగప్పకు వెన్నుపూసలో మాత్రమే ముల్లు ఉంటుందని.. చేప చాలా మెత్తగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోతుందని.. ఈ చేపను తింటే శరీరానికి కావాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయని. మాంసాహారం మాత్రమే తినడం ఈ చేప ప్రత్యేకతగా చెబుతున్నారు మత్స్యకారులు.