మహిళల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపే రుతుక్రమం గురించి విలువైన విషయాలు మీకోసం..
- నాలుగు దశల్లో..
- రుతుస్రావ దశ: సాధారణంగా ఇది 1-5 రోజుల వరకు ఉంటుంది. చాలామందికి 3 నుంచి 5 రోజులు బహిష్టు కావొచ్చు. కానీ కొందరికి 2 రోజులే అవ్వచ్చు. కొందరికి 7 రోజుల వరకూ సాగొచ్చు.
- అండం తయారయ్యే దశ:ఇది 6-14 రోజుల వరకు సాగుతుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది గర్భాశయ గోడ (ఎండోమెట్రియం) మందమయ్యేలా తయారుచేస్తుంది. ఎఫ్‌ఎస్‌హెచ్ అనే మరో హార్మోన్ మూలంగా అండాశయాల్లో ఫాలికల్స్ పుట్టుకొస్తాయి. వీటిల్లో ఒక దాంట్లోనే అండం పరిపక్వమవుతుంది.
- అండం విడుదలయ్యే దశ:ఇది సుమారు 14 రోజులకు మొదలవుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ స్థాయులు హఠాత్తుగా పెరిగి అండం విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది.
- ల్యూటియల్ దశ:ఇది 15-28 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో గర్భధారణకు అనువుగా గర్భసంచిని సిద్ధం చేయటానికి ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఒకవేళ గర్భం ధరించకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. మందమైన గర్భాశయ గోడ రాలిపోయి రుతుస్రావంతో బయటకు వస్తుంది.
అనుగుణంగా వ్యాయామం..
- అధిక రుతుస్రావం, విపరీతమైన పొత్తికడుపు నొప్పి వంటి ఇబ్బందులేవీ లేకపోతే రుతుస్రావం అవుతున్న రోజుల్లో తేలికైన వ్యాయామాలు, యోగా చేయటం మంచిది. నెమ్మదిగా కండరాలను సాగదీసే ఇలాంటి వ్యాయామాలు నొప్పి తగ్గటానికి తోడ్పడతాయి.
- అండం విడుదలకు శరీరం సన్నద్ధమయ్యే రోజుల్లో పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేయొచ్చు. ఇవి శక్తి మరింత పెరిగేలా చేస్తాయి. పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు గలవారైతే నెమ్మదిగా నడవటం మేలు.
- అండం విడుదలయ్యే సమయంలో జిమ్‌లో కష్టమైన వ్యాయామాల వంటివీ చేయొచ్చు.