కొవిడ్-19 కొత్త పాఠాలు నేర్పింది. వైద్యం తీరుతెన్నులను గణనీయంగా మార్చేసింది. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో టెలీ మెడిసిన్‌కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. ఫోన్, వాట్సాప్, వెబ్‌సైట్ల ద్వారానే డాక్టర్లను సంప్రదించటం పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో మన గురించి డాక్టర్లకు కచ్చితమైన సమాచారం అందించేదెలా? ఈ విషయంలో క్లినిక్‌లలో తరచూ వాడే కొన్ని పరికరాలను ఇంట్లో ఉంచుకోవటం ఎంతగానో మేలు చేస్తుంది. డాక్టర్లు అడిగే విషయాల గురించి వెంటనే వివరించటానికి.. సమస్య మామూలుదా? అత్యవసరమైందా? అనేది తేల్చుకోవటానికిది ఉపయోగపడుతుంది.
థర్మామీటర్
ప్రస్తుతం డాక్టర్లంతా ముందుగా అడిగేది జ్వరం గురించే. దీన్ని తెలుసుకోవటానికి థర్మామీటరు తప్పనిసరి. కాబట్టి ఇంట్లో పాదరస రహిత థర్మామీటర్ (డిజిటల్ థర్మామీటర్) ఉంచుకోవటం మంచిది. దీన్ని ఉపయోగించటం తేలిక. శరీర ఉష్ణోగ్రతను బట్టి డాక్టర్లు రకరకాల జబ్బులను అంచనా వేస్తారు. ఈ రోజుల్లో జ్వరం 100 డిగ్రీల సెల్షియస్ కన్నా తక్కువుంటే కొవిడ్‌గా, 101 కన్నా ఎక్కువుంటే ఇతరత్రా వైరల్ ఇన్‌ఫెక్షన్లుగా భావించొచ్చు. జ్వరం దశ దశలుగా ఎక్కువవుతూ వస్తుంటే టైఫాయిడ్‌గా, సాయంత్రం పూట జ్వరం వస్తుంటే క్షయగా, ఉష్ణోగ్రత 104 కన్నా ఎక్కువుంటే మలేరియాగా.. ఇలా ఒక అంచనాకు రావటానికి వీలుంటుంది.
బరువు యంత్రం
నాణ్యమైన బరువు తూచే పరికరం కూడా ముఖ్యమే. స్ప్రింగుతో కూడిన దాని కన్నా ఎలక్ట్రానిక్ పరికరమైతే మేలు. దీంతో ఎప్పటికప్పుడు బరువు పెరగటం, తగ్గటం తెలుసుకోవచ్చు. గుండె, కిడ్నీ, కాలేయ సమస్యలు గలవారిలో ఒంట్లో నీరు నిల్వ ఉండిపోతుంటుంది. ఇది బరువులో ప్రతిఫలిస్తుంది. దీని ద్వారా మందులు పనిచేస్తున్నాయా? మోతాదు పెంచాల్సి ఉంటుందా? అనేవి తెలుసుకోవచ్చు.
గ్లూకోమీటరు
ఇటీవలి కాలంలో ఇది ఇంటింటి పరికరంగా మారిపోయింది. భోజనానికి ముందూ తర్వాతా రక్తంలో గ్లూకోజు మోతాదులు తెలుసుకోవటాకిది ఎంతగానో తోడ్పడుతుంది. ఇన్సులిన్ తీసుకునేవారు ఎప్పటికప్పుడు గ్లూకోజు మోతాదులు తెలుసుకోవటానికి, గ్లూకోజు మోతాదు బాగా పడిపోయిందనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే పరీక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎవరికివారు ఇన్సులిన్ మోతాదు మార్చుకోవచ్చు. లేదూ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవచ్చు. కొవిడ్ దుష్ప్రభావాలకూ మధుమేహానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటున్న తరుణంలో గ్లూకోమీటరు ఇంట్లో ఉండటం తప్పనిసరి అవుతోంది.
రక్తపోటు పరికరం
జబ్బులు ఏవైనా డాక్టర్లు విధిగా రక్తపోటు పరీక్షిస్తుంటారు. ఆసుపత్రులకు వెళ్లలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఒక బీపీ పరికరం ఉంచుకోవటం ఎంతైనా మంచిది. ఇప్పుడు పాదరస రహిత, స్టెతస్కోప్ అవసరం లేని ఎలక్ట్రానిక్ బీపీ పరికరాలు బాగానే అందుబాటులో ఉన్నాయి. వీటితో ఇంట్లోనే రక్తపోటును తేలికగా పరీక్షించుకోవచ్చు. దీన్ని బట్టి రక్తపోటు తీరుతెన్నులను తెలుసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్లు మందుల మోతాదు పెంచటం, తగ్గించటం చేస్తారు.
పీక్ ఫ్లో మీటర్
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే పరికరమిది. గట్టిగా శ్వాస తీసుకొని ఒక్కసారిగా ఇందులోకి గాలిని ఊదాల్సి ఉంటుంది. దీంతో అత్యధిక నిశ్వాస ప్రవాహ వేగం బయటపడుతుంది. ఆస్థమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు గలవారికిది బాగా ఉపయోగపడుతుంది. మందుల మోతాదు పెంచినా నిశ్వాస వేగం పెరగకపోతే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అత్యవసర పరిస్థితిని ముందుగానే పసిగట్టటానికి వీలుంటుంది.