రాధ రోజూ ఇంటి దగ్గర్లో ఉండే జిమ్‌కు పిల్లలతోపాటు వెళ్లేది. అక్కడ ఓ అరగంట అందరూ కలిసి చిన్నచిన్న వ్యాయామాలు, యోగా చేసేవారు. కొవిడ్(Covid 19 India) ప్రభావంతో ఆమె జిమ్ మానేసింది. కొవిడ్ ప్రభావం తగ్గుతున్న ఈ సమయంలో తిరిగి పిల్లలను తీసుకుని జిమ్‌కు(Gym Uses) వెళ్లాలని ఉన్నా భయపడుతోంది. ఇటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తక్కువని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అవేంటో చూద్దాం..
సిద్ధంగా..
పిల్లలను తీసుకెళ్లినప్పుడు ఇరుకుగా ఉండే జిమ్ కాకుండా, విశాలంగా బయటిగాలి లోపలికి వచ్చే సౌకర్యం ఉండేదాన్ని ఎంచుకుంటే మంచిది. వెళ్లేటప్పుడు వారికి మంచినీళ్ల సీసా, మాస్కు, తువ్వాలు, మ్యాట్, హ్యాండ్ గ్లవుజులు, శానిటైజర్ ఉంచిన బ్యాగు ఎవరిది వారికి అందించాలి. మీకూ విడిగా సిద్ధం చేసుకోవాలి. ఇతరుల వస్తువులు అడగకుండా, తమ వస్తువులనే వినియోగించుకోవాలని పిల్లలకు చెప్పాలి. జిమ్‌లో(Gym benefits) పాటించాల్సిన నియమాలను ముందుగానే వారికి నేర్పడం మంచిది.
సమయపాలన..
కేటాయించుకున్న సమయానికి జిమ్‌కు చేరుకోవాలి. ముందుగానే అక్కడకు వెళ్లి, జనం మధ్యలో ఉండకూడదు. అలా పది నిమిషాల ముందుగా వెళ్లినా, జిమ్‌కు బయట దూరంగా నిలబడటం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు కూడా మిగతా వారికి, మీకూ మధ్య కనీస దూరాన్ని పాటించాలి. ఈ అంశాన్ని పిల్లలకూ అలవడేలా చేయాలి. అప్పటివరకు మరొక వ్యక్తి వినియోగించిన జిమ్ సామాగ్రిపై బ్యాక్టీరియా, సూక్ష్మజీవులుండే ప్రమాదం ఉంది. వాటిని ముట్టుకునే ముందు చేతులకు, ఆ పరికరాలకు శానిటైజర్ రాయడం మర్చిపోకూడదు. ఆ తర్వాతే.. వ్యాయామాలు మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి.