Weight Control: ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. కొందరు సన్నగా ఉంటే, కొందరు లావుగా ఉంటారు. ఇది శరీర స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. బరువు, ఆకారాలను బట్టి మనుషులను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. పొడవుగా, సన్నగా ఉండేవారు (ఎక్టోమార్ఫ్).. బలంగా, దృఢంగా ఉండేవారు (మీసోమార్ఫ్).. అధిక బరువు గలవారు (ఎండోమార్ఫ్). సన్నగా ఉండేవారిలో జీవక్రియల వేగం ఎక్కువ. వీరిలో కండర మోతాదుతో పాటు కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నా బరువు అంతగా పెరగరు. దృఢంగా ఉండేవారిలో కండరాల మోతాదు ఎక్కువ. వీరు త్వరగా బరువు పెరుగుతారు గానీ కాస్త ప్రయత్నిస్తే తేలికగానే అదుపులో ఉంచుకోవచ్చు. ఇక అధిక బరువు గలవారిలో కేలరీలు అంతగా ఖర్చుకావు. జీవక్రియల వేగమూ నెమ్మదిస్తుంది. ఏం తినాలన్నా భయమే. జీవితాంతం బరువు పెరగకుండా చూసుకోవటానికి ప్రయత్నించాల్సి వస్తుంది.
బొజ్జ వద్ద కొవ్వు:సాధారణంగా ఆడవాళ్ల కన్నా మగవాళ్లు కాస్త సన్నగా ఉంటారు. ఆడవారిలో వయసు పెరుగుతున్నకొద్దీ, నెలసరి నిలిచిపోయే సమయానికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది. దీనికి కొంతవరకు హార్మోన్లలో తలెత్తే మార్పులను కారణంగా చెప్పుకోవచ్చు. బొజ్జ మూలంగా శరీర ఆకారం యాపిల్ మాదిరిగా కనిపిస్తుంది. వయసు, జీవక్రియల వేగం నెమ్మదించటం, వ్యాయామం చేయకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తినటం, ఒత్తిడి, నిద్రలేమి వంటివన్నీ క్రమంగా ఇలాంటి స్థితికి తీసుకొస్తాయి. ఆడవారైనా, మగవారైనా.. ఇలాంటివారిలో కడుపులోని అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన కొవ్వు. అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటికి దారితీస్తుంది.
ఊబకాయ కొలమానాలు:అధిక బరువు, ఊబకాయాన్ని గుర్తించటానికి కొన్ని కొలమానాలు ఉపయోగపడతాయి. వీటిల్లో నడుము-తుంటి నిష్పత్తి (డబ్ల్యూహెచ్‌ఆర్) ఒకటి. దీన్ని ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. తుంటి చుట్టుకొలతను నడుము చుట్టుకొలతతో భాగిస్తే వీటి నిష్పత్తి తెలుస్తుంది. మహిళల్లో ఇది 0.85, అంతకన్నా తక్కువగా.. పురుషుల్లో 0.9 కన్నా తక్కువగా ఉండాలి. మరో కొలమానం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ). ఎత్తును ఎత్తుతో గుణించి (మీటర్లలో).. బరువుతో (కేజీల్లో) భాగించి దీన్ని లెక్కిస్తారు. ఇది 30 కన్నా పెరిగితే ఊబకాయం ఉన్నట్టే. సాధారణంగా యాపిల్ ఆకారం శరీరం గలవారిలో బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం.