శృంగారాన్ని కూడా ఓ తప్పనిసరి దినచర్యలా భావిస్తుంటారు కొంతమంది. కనీసం భాగస్వామి ఇష్టాయిష్టాలేంటి, వాళ్ల మనసులోని కోరికలేమిటో తెలుసుకోవడానికి, పంచుకోవడానికీ సిగ్గుపడుతుంటారు. వీటికి తోడు కొంతమందిలో ఉండే కొన్ని భయాలు కూడా శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా అడ్డుపడుతున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ తరహా భయాలు మగవారిలో కంటే మహిళల్లోనే ఎక్కువని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి.
నిజానికి ఇవి దంపతుల మధ్య అగాథం సృష్టించడమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్నాయంటున్నారు. అందుకే అనవసర భయాల్ని దూరం చేసుకొని..ఈ విషయంలో ఆలుమగలిద్దరూ తమ మనసు విప్పి మాట్లాడుకోవాలని, అప్పుడే శృంగార జీవితాన్ని సంతృప్తికరంగా మలచుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఆ భయాలేంటి? వాటిని ఎలా జయించాలో తెలుసుకుందాం రండి..
ఆ 'నొప్పి'కి ప్రత్యామ్నాయం ఉందిగా..!
పెళ్లైన కొత్తలో చాలామంది ఆడవాళ్లు శృంగారం చేసే క్రమంలో వచ్చే నొప్పికి భయపడి కలయికలో పాల్గొనడానికి భయపడుతున్నారని తమ వద్దకొచ్చే ఫిర్యాదుల్ని బట్టి చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల కూడా భార్యాభర్తలు లైంగిక జీవితం గురించి ఒకరి మనసులో దాగున్న ఆలోచనలు, కోరికలు నిర్మొహమాటంగా పంచుకోలేకపోతున్నారట! అందుకే భయమనే ఈ అడ్డు తెర తొలగిపోవాలంటే.. నొప్పి రాకుండా ఉండేందుకు తగిన ప్రత్యామ్నాయాల గురించి అన్వేషించాలి. ఈ క్రమంలో లూబ్రికెంట్లు, జెల్స్, మాయిశ్చరైజర్లు.. వంటివి నిపుణుల సలహా మేరకు ఉపయోగించచ్చు. అయితే కొంతమందిలో ఈ తరహా నొప్పి నిరంతరంగా వేధిస్తుంటుంది. కలయికే కాదు.. వెజైనల్ ఇన్ఫెక్షన్లు కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి దీన్నుంచి ఉపశమనం పొందడానికి నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
గర్భవతిని అవుతానేమో?!
పెళ్లైనా మాకు అప్పుడే పిల్లలొద్దు.. అనుకునే దంపతులు కొందరుంటారు. ఇలాంటి వారు శృంగారంలో పాల్గొనడానికి వెనకాముందూ అవుతుంటారు. ఎందుకంటే దీనివల్ల గర్భం ధరిస్తానేమోనన్న భయం ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కలయికను ఆస్వాదించలేకపోతారు. అయితే ప్రస్తుతం అవాంఛిత గర్భం ధరించకుండా ఉండేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. గర్భ నిరోధక మాత్రలు, సాధనాలు.. వంటివి అందులో కొన్ని! నిపుణుల సలహా మేరకు వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇదేమీ కొత్త విషయం కాకపోయినా.. వీటిని ఉపయోగిస్తూ కూడా.. ఇవి సరిగ్గా పనిచేస్తాయో, లేదోనన్న సందేహంతో శృంగారంలో పాల్గొనడానికి భయపడే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు మీ రుతుచక్రాన్ని బట్టి అండం విడుదలయ్యే రోజుల్ని లెక్కించి.. ఆ సమయంలో దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.