చిరుధాన్యాలు చూడటానికి చిన్నవే కావొచ్చు గానీ ఇవి పోషకాల గనులు! ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో దండిగా ఉంటాయి. మేలురకం పిండి పదార్థాలు ఉండటం వల్ల జీర్ణక్రియ నియంత్రణకూ తోడ్పడతాయి. అన్నింటికన్నా మంచి విషయం- చాలాసేపు కడుపు నిండిన భావన కలిగించటం. ఇలా త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు? రాగులు, సజ్జలు ఎముక పుష్టికీ తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గటానికీ దోహదం చేస్తాయి. సాధారణంగా కీళ్ల సమస్యలతో బాధపడేవారికి ధాన్యాలు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. వీటిల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ చిరుధాన్యాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇవి వాపు ప్రక్రియను తగ్గించే గుణం.. ఎముకల బలోపేతానికి అవసరమైన పోషకాలు కలిగుండటమే దీనికి కారణం.
- రాగులు, సజ్జలకు వాపు ప్రక్రియను నివారించే గుణముంది. దీంతో కీళ్లలో వాపు తగ్గుతుంది. కీళ్ల అరుగుదలతో వేధించే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
- రాగుల్లో క్యాల్షియం దండిగా ఉంటుంది. వంద గ్రాముల రాగులతో 244 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, ఎముకలు విరిగిపోయే ముప్పు తగ్గుతుంది.
- సజ్జల్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మి.గ్రా. క్యాల్షియం, 296 మి.గ్రా. ఫాస్ఫరస్ ఉంటాయి.