తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

తరచుగా వచ్చే నీరసాన్ని తగ్గించుకునేందుకు చిట్కాలు..

మీరు తరచుగా నీరస పడిపోతున్నారా? అయితే మీకు రక్తహీనత ఉండవచ్చు. దీన్నుంచి బయటపడటానికి ఆయుర్వేద పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో డాక్టర్​ గాయత్రీదేవి సూచించారిలా..

tips to follow to reduce Anemia and increase stamina
తరచుగా వచ్చే నీరసాన్ని తగ్గించుకునేందుకు చిట్కాలు..

By

Published : Sep 30, 2020, 12:04 PM IST

మీ నీరసానికి రక్తహీనత కారణమని వైద్యులు నిర్ధారించారని చెబుతున్నారు. దీనికి కారణాన్ని మీరు తెలుసుకోవాలి. రక్తకణాలు తయారుకావడంలో లోపం, నెలసరిలో అధిక రక్తస్రావం, కడుపులో నులిపురుగులు లేదా మలంలో రక్తం పడుతున్నా ఈ సమస్య ఎదురవుతుంది. కారణం తెలిస్తే చికిత్సతో అదుపులోకి తెచ్చుకోవచ్చు. అలాగే పైన చెప్పిన సమస్యల్లో ఏదీ కాదని తేలితే, పోషకాహారలోపమే కారణమని చెప్పొచ్చు. ఇటువంటప్పుడు ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే ఇందులోంచి తేలికగా బయటపడొచ్చు.

ఇవి తప్పనిసరి...

యాపిల్‌, అరటిపండు, కిస్‌మిస్‌, ఖర్జూరం, అలాగే బీట్‌రూట్‌, మెంతికూర, ఉల్లికాడలు, గోంగూర, పాలకూర, సోయాబీన్స్‌, నువ్వులు, తేనె, పాలు, పెరుగు, ఉసిరి వంటివి తప్పనిసరిగా రోజూ ఆహారంలో ఉండాలి. మాంసాహారం తీసుకునే అలవాటుంటే బోన్‌ సూప్‌ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజూ కప్పు నీటిలో గంటసేపు నానబెట్టిన నాలుగు ఎండు ఖర్జూరాలను మెత్తని గుజ్జులా చేసుకుని తినాలి. నువ్వులు వేయించి పొడి చేసి సమానంగా బెల్లం కలిపి లడ్డు ఆకారంలో చేసుకుని భద్రపరుచుకుని, ప్రతిపూటా ఒక లడ్డును తింటూ ఉండాలి.

అలాగే కప్పు బీట్‌రూట్‌ రసం లేదా కప్పు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది. రెండు పెద్ద ఉసిరికాయలు పచ్చిగానే తినడం అలవరుచుకోవాలి. లేదంటే ఒకేసారి కొన్ని ఉసిరికాయలను తేనెలో నానబెట్టి ఉంచితే, ప్రతిరోజూ రెండు చొప్పున తినొచ్చు. చెంచా ఉసిరి చూర్ణంలో తేనె కలిపి తింటే రక్తవృద్ధి కలుగుతుంది. ఈ సూచనలన్నింటినీ పాటిస్తేనే రక్తహీనత సమస్యకు దూరమై, ఆరోగ్యవంతంగా ఉండొచ్చు.

ఇదీ చదవండి:చనుబాల నాణ్యత పెంచే ఆయుర్వేదం!

ABOUT THE AUTHOR

...view details