Deep Sleep Tips: ఆరోగ్యమయ జీవితానికి రోజూ ఏడు గంటల నాణ్యమైన నిద్ర అవసరమని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అన్ని గంటలు మంచంపైనే ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టని వాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ నియమాలు పాటిస్తే మార్పు ఉంటుంది.
20 నిమిషాల కాంతి..
సూర్యోదయానికి ముందే మేల్కొనడం మంచి అలవాటని పెద్దలు చెబుతారు. అది ఊరికే చెప్పింది కాదు, అందులో శాస్త్రీయత ఉంది. శరీరానికి తగినంత ఎండ తగిలితే 14 గంటల తర్వాత చక్కగా నిద్ర పడుతుందట. అందుకే పొద్దున్న ఎంత సేపు ఎండలో ఉంటే అంత మంచిది. నీరెండలో నడవడం, ఎండ తగిలే చోట బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఎండ తగిలే కిటికీ దగ్గర ఉండటం.. ఇలా ఏదో ఒక రూపంలో కనీసం 20 నిమిషాలు ఎండ పడేలా చూసుకోవడం ముఖ్యం.
30 గ్రాముల ఫైబర్..
సరైన మోతాదులో ఫైబర్ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్రలో గాఢత సమయాన్నీ పెంచుతుంది. విశ్రాంతి, అలసట తీరి నూతనోత్తేజంతో తర్వాత రోజును ప్రారంభించాలంటే ఇది అవసరం. ఓట్స్, పప్పులు, పండ్లు, కూరగాయల ద్వారా ఫైబర్‌ని తగినంత తీసుకోవాలి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఇంకా మంచిది.
6 నిమిషాల చదువు..
నిద్రలేమి కారణాల్లో ఒత్తిడి ప్రధానమైనది. నిద్ర పోవడానికి ముందు కనీసం ఆరు నిమిషాలు చదివితే.. 68 శాతం ఒత్తిడి తగ్గుతుంది.
25 డిగ్రీల ఉష్ణోగ్రత..
సాయంత్రానికి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. కాబట్టి బెడ్‌రూమ్‌లోనూ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 25-26 డిగ్రీల వాతావరణంలో నిద్ర బాగా పడుతుంది.