తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పిల్లల్లో థైరాయిడ్​-గుర్తించకపోతే పెను శాపం

Thyroid in Kids: బిడ్డ పుట్టగానే సంతోషంతో పొంగిపోతాం. గుళ్లు, గోపురాలకు వెళ్తాం. భక్తితో మొక్కులు సమర్పించుకుంటాం. కానీ థైరాయిడ్‌ గ్రంథి గురించి పెద్దగా పట్టించుకోం. చాలామందికి దీని గురించే తెలియదన్నా అతిశయోక్తి కాదు. థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే హార్మోన్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పుట్టిన తొలినాళ్లలో మెదడు ఎదుగుదలకు ఇవి అత్యంత కీలకం. భావి జీవితానికి పునాది వేస్తాయి. ఇవి పుట్టుకతోనే లోపిస్తే (కంజెనిటల్‌ హైపోథైరాయిడిజం) జీవితాంతం ప్రభావం చూపుతాయి. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే- సాధారణ రక్తపరీక్షతోనే సమస్యను గుర్తించే వీలుండటం. సులువైన చికిత్సతో దీని ద్వారా తలెత్తే అనర్థాలను తప్పించుకోగలగటం.

Thyroid in Kids
చిన్న సమస్య..పెను శాపం

By

Published : Dec 21, 2021, 10:36 AM IST

Thyroid in Kids: థైరాయిడ్‌ లోపం అనగానే అదేదో పెద్దవాళ్ల సమస్య అనుకుంటాం. కానీ పిల్లల్లో పుట్టుకతోనూ రావొచ్చు. గుర్తిస్తే ఇది చిన్న సమస్యే. తేలికగా అదుపు చేయొచ్చు. గుర్తించకపోతే మాత్రం పెను శాపంగా మారుతుంది. పిల్లలు జీవితాంతం దీని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది. జీవక్రియలు.. అంటే శరీరంలోని అన్ని అవయవాల పనులు సజావుగా కొనసాగటంలో థైరాయిడ్‌ హార్మోన్లు (టీ3, టీ4) కీలకపాత్ర పోషిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి శరీరం మొత్తాన్ని చురుకెత్తిస్తాయి. మన మెడ ముందు భాగాన, శ్వాసనాళానికి అటూఇటూ సీతాకోక చిలుక ఆకారంలో అంటుకొని ఉండే థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఇవి ఉత్పత్తి అవుతాయి. దురదృష్టవశాత్తు కొందరు పిల్లల్లో పుట్టుకతోనే వీటి లోపం తలెత్తొచ్చు. దీంతో మెదడు సరిగా ఎదగదు. ఇతరత్రా శారీరక ఎదుగుదల దశలూ నెమ్మదిస్తాయి. అందుకే శిశువుల్లో థైరాయిడ్‌ లోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించటం చాలా ముఖ్యం. ఎందుకంటే సమస్య ఉన్నా మొదట్లో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు బయటపడేసరికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. మందులు వాడినా దుష్ప్రభావాలను పూర్తిగా వెనక్కి మళ్లించటం సాధ్యం కాదు. కాబట్టి పుట్టుకతో తలెత్తే థైరాయిడ్‌ లోపం మీద అవగాహన కలిగుండటం మంచిది.

థైరాయిడ్​

ఎందుకు వస్తుంది?

పుట్టుకతో వచ్చే థైరాయిడ్‌ సమస్యను ఒకరకంగా అవయవ నిర్మాణ లోపమని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం థైరాయిడ్‌ గ్రంథి అసలే ఏర్పడకపోవటం (అప్లేసియా). కొందరికి గ్రంథి ఏర్పడినా చిన్నగా ఉండొచ్చు (హైపోప్లేసియా). కొందరికి గ్రంథి మెడలో వేరే చోట ఉండొచ్చు (ఎక్టోపిక్‌). కొన్నిసార్లు గ్రంథి ఏర్పడినా సరిగా పనిచేయకపోవచ్చు. ఇవన్నీ సమస్యకు దారితీసేవే. థైరాయిడ్‌ గ్రంథి సక్రమంగా ఉండటమే కాదు, దీనికి మెదడు నుంచి సంకేతాలు అందకపోయినా ఇబ్బందే. థైరాయిడ్‌ గ్రంథిని మన మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ‘థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌’ (టీఎస్‌హెచ్‌) ప్రేరేపిస్తుంటుంది. టీ3, టీ4 హార్మోన్లు విడుదలయ్యేలా చేసేది ఇదే. మెదడు నుంచి సంకేతాలు అందకపోతే టీఎస్‌హెచ్‌ సరిగా ఉత్పత్తి కాదు. ఇది థైరాయిడ్‌ హార్మోన్ల లోపానికి దారితీస్తుంది. కొందరు తల్లికి థైరాయిడ్‌ సమస్య ఉంటే బిడ్డకు వస్తుందని భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. తల్లికి హైపోథైరాయిడిజమ్‌ ఉన్నంతమాత్రాన బిడ్డకు రావాలనేమీ లేదు. కానీ అరుదుగా కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. గర్భిణి తినే ఆహారంలో అయోడిన్‌ లోపించటం వల్ల కూడా పుట్టుకతో థైరాయిడ్‌ జబ్బు రావొచ్చు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరూ అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడు తుంటారు. కాబట్టి గర్భిణుల్లో అయోడిన్‌ లోపించే అవకాశం తక్కువ.

రెండు రకాలు

హైపోథైరాయిడిజమ్‌ రెండు రకాలు. ఒకటి గ్రంథితో ముడిపడింది (ప్రైమరీ). ఎక్కువగా కనిపించేది ఇదే. ఇందులో టీఎస్‌హెచ్‌ ఎక్కువగా ఉన్నా థైరాయిడ్‌ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కావు. రెండోది ఇతరత్రా కారణాలతో వచ్చేది (సెకండరీ). మెదడు నుంచి సంకేతాలు అందకపోవటం దీనికి మూలం. వీరిలో టీఎస్‌హెచ్‌ ఉత్పత్తి కాదు.

నిర్ధరణ ఎలా?

శిశు హైపోథైరాయిడిజంను చిన్న రక్త పరీక్ష ద్వారా తేలికగా నిర్ధరించొచ్చు. ఇందులో మడమ నుంచి చిన్న రక్తం చుక్కను తీసి, దాన్ని ప్రత్యేక కాగితం మీద అంటించి విశ్లేషిస్తారు. పుట్టిన వెంటనే బొడ్డు తాడు నుంచి తీసిన రక్తం ద్వారానూ దీన్ని గుర్తించొచ్చు. రక్తంలో థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించే టీఎస్‌హెచ్‌ మోతాదులు ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా ఉంటే సమస్య ఉందని అనుమానిస్తారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ పరీక్షిస్తారు. అప్పుడూ టీఎస్‌హెచ్‌ ఎక్కువగా ఉంటే హైపో థైరాయిడిజమ్‌గా నిర్ధరిస్తారు. సాధారణంగా పుట్టిన వెంటనే ఒంట్లో హార్మోన్ల మోతాదులు పెరుగుతాయి. తర్వాత తగ్గుతూ వస్తాయి. అందుకే థైరాయిడ్‌ పరీక్షలను రెండు, మూడు రోజుల తర్వాతే చేస్తారు. పుట్టిన తొలినాళ్లలోనైతే టీఎస్‌హెచ్‌ మోతాదులు 40 కన్నా తక్కువగా ఉండాలి. రెండు వారాల వయసు వచ్చేసరికి 20 కన్నా తక్కువగా.. మూడు వారాల్లో 10 కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా పెరిగితే హైపోథైరాయిడిజమ్‌ ఉందనే అర్థం. ఎందుకంటే థైరాయిడ్‌ హార్మోన్లు తగినంత మోతాదుల్లో లేకపోతే వీటి ఉత్పత్తిని ప్రేరేపించటానికి టీఎస్‌హెచ్‌ మరింత ఎక్కువగా విడుదలవుతుంటుంది.

చికిత్స ఎలా?

హైపోథైరాయిడిజం చికిత్స తేలిక. దీన్ని గుర్తించి, కచ్చితంగా నిర్ధరించటమే కీలకం. పుట్టిన 3 రోజుల తర్వాత టీఎస్‌హెచ్‌ మోతాదులు ఎక్కువున్నట్టు తేలినప్పటికీ వెంటనే చికిత్స మొదలు పెట్టరు. జాగ్రత్తగా గమనిస్తారు. తిరిగి 2 వారాల్లోపు మరోసారి పరీక్షిస్తారు. అప్పుడూ టీఎస్‌హెచ్‌ ఉండాల్సిన మోతాదుల కన్నా ఎక్కువుంటే చికిత్స ఆరంభిస్తారు. అయితే ఆరంభంలోనే టీఎస్‌హెచ్‌ మరీ అధికంగా ఉంటే వెంటనే చికిత్స మొదలెడతారు. వీరికి ప్రధానమైన మందు లివోథైరాక్సిన్‌. దీన్ని శిశువుల బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి పెద్దగా ఖర్చేమీ కాదు.

స్క్రీనింగ్‌ కీలకం

పుట్టిన తొలినాళ్లలో మెదడులోని నాడీ కణాల మధ్య అనుసంధానాలు విస్తృతంగా పుట్టుకొస్తుంటాయి. థైరాయిడ్‌ హార్మోన్లు లోపిస్తే ఇవి సరిగా ఏర్పడవు. దీంతో ఎదుగుదల కుంటుపడుతుంది. తల నిలపటం, నవ్వటం, బోర్లా పడటం వంటివి మందగిస్తాయి. బొమ్మను వదిలేస్తే ఒరిగినట్టు పిల్లలు పక్కలకు పడిపోతుంటారు. ఇలాంటి లక్షణాలు 3 నెలలు దాటాకే బయటపడుతుంటాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఒకసారి నాడీ కణాల అనుసంధానాలు దెబ్బతింటే అంతే. తిరిగి మామూలు స్థాయికి రావు. అందువల్ల సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పుట్టిన వెంటనే ముందస్తు పరీక్షలతో (స్క్రీనింగ్‌) దీన్ని తేలికగా గుర్తించొచ్చు. లేకపోతే దీని అనర్థాలు జీవితాంతం వెంటాడుతూ వస్తాయి. చికిత్సతో ఇబ్బందులను తగ్గించుకోవచ్చు గానీ పూర్తిగా వెనక్కి మళ్లించటం సాధ్యం కాదు. ఏదో ఒక లోపం కొనసాగుతూనే వస్తుంటుంది. స్క్రీనింగ్‌తో వీటిని పూర్తిగా నివారించుకోవచ్చని గుర్తించటం అవసరం.

జీవితాంతం మందులు వాడాలా?

హైపోథైరాయిడిజంలో ఎదుగుదల దెబ్బతింటుంది కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడటం చాలా ముఖ్యం. గ్రంథి అసలే ఏర్పడకపోయినా, ఉండాల్సిన చోట లేకపోయినా, చిన్నగా ఉన్నా జీవితాంతం మందులు వేసుకోవాలి. మందులు సక్రమంగా వాడితే థైరాయిడ్‌ లోపం దుష్ప్రభావాలను అధిగమించొచ్చు. కొందరికి.. స్వల్ప మోతాదుతోనే గుణం కనిపిస్తున్నవారికి, మందు మోతాదు మార్చాల్సిన అవసరం లేనివారికి మూడేళ్ల తర్వాత మందులు ఆపేసే అవకాశముంది. ఇలాంటివారు చాలావరకు జబ్బు నుంచి బయటపడతారు.

లక్షణాలేంటి?

పుట్టుకతో థైరాయిడ్‌ లోపించినా మొదట్లో పైకి ఎలాంటి లక్షణాలూ ఉండవు. క్రమంగా కొన్ని లక్షణాలు పొడసూపుతుంటాయి.

థైరాయిడ్​ బారిన పడిన చిన్నారులు
  1. చర్మం పసుపురంగులోకి మారటం (కామెర్లు)
  2. నిస్సత్తువ (బలహీనత, ఎక్కువసేపు నిద్రపోవటం, నిద్రలేచాక అలసినట్టు కనిపించటం)
  3. పాలు సరిగా తాగకపోవటం
  4. చర్మం పొడిబారటం
  5. మెత్తటి మాడు భాగం పెద్దగా ఉండటం
  6. కీచు గొంతుతో ఏడ్వటం
  7. ఆకలి మందగించటం
  8. బొడ్డు పైకి ఉబ్బినట్టు ఉండటం
  9. మలబద్ధకం
  10. ఎముకలు త్వరగా వృద్ధి చెందకపోవటం
  11. కండరాల బలహీనత
  12. ముఖం ఉబ్బరించటం
  13. నాలుక పెద్దగా ఉండటం

-డాక్టర్​ జె.లీనతా రెడ్డి, పీడియాట్రిక్​ ఎండోక్రైనాలజిస్ట్

ఇదీ చూడండి :వ్యాయామంతో పిల్లలకు ఎన్ని లాభాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details