పక్షవాతం అనగానే అదేదో వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది చిన్న వయసులోనూ రావొచ్చు. నిజానికి చిన్న వయసులో పక్షవాతం తక్కువే అయినా.. దీనికి వయసుతో నిమిత్తమేమీ లేదు. ఇటీవలి కాలంలో 20-54 ఏళ్ల వయసులో పక్షవాతం బారినపడటం పెరుగుతోందని పరిశోధనలు పేర్కొంటుండటం ఆందోళనకరం.
పక్షవాతానికి వయసుతో పని లేదు.. జాగ్రత్తలే కీలకం! - Paralysis
మానవులకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో పక్షవాతం కూడా ఎంతో భయంకరమైంది. పక్షవాతం బారిన పడితే చెట్టంత మనిషి కూడా మంచానికి పరిమితం అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ పక్షవాతం ముప్పు పెరగటానికి ఏమి దోహదం చేస్తున్నాయి? ఏ వయసు వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది? తెలుసుకుందాం..
రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి మెదడుకు రక్తం అందకపోవటం (ఇస్కిమిక్), రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం కావటం (హెమరేజిక్).. ఇలా పక్షవాతం రెండు రకాలుగా రావొచ్చు. చిన్న వయసులోనైనా పెద్ద వయసులోనైనా పక్షవాతం ముప్పు కారకాలు ఒకటే. సాధారణంగా అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, పొగ అలవాటు, మధుమేహం వంటివి పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తాయి. ఇవి ప్రస్తుతం చిన్న వయసువారిలోనూ ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే చిన్న వయసులో వీటికి తోడు పుట్టుకతో తలెత్తే గుండెజబ్బులు, రక్తం గడ్డ కట్టటంలో లోపాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఇలాంటి జబ్బులను గుర్తించి, చికిత్స తీసుకోకపోతే పక్షవాతం త్వరగా ముంచుకువచ్చే అవకాశముంది. గర్భనిరోధక మాత్రలు వేసుకునే మహిళలకు పొగ తాగే అలవాటు కూడా ఉంటే పక్షవాతం ముప్పూ పెరగొచ్చు. అలాగే రక్తనాళ గోడల్లో చీలికలు, మాదక ద్రవ్యాల అలవాటు కూడా చిన్న వయసులో పక్షవాతం ముప్పు పెరిగేలా చేస్తున్నాయి.
ఇదీ చూడండి: పక్షవాతం రాకుండా ముందస్తు జాగ్రత్తలు