చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరినీ వేధిస్తున్న సమస్య పార్శ్వనొప్పి(Migraine). దీని నుంచి ఉపశమనం పొందటానికి ఈ చిట్కాలు పాటించండి..
- ఐస్ ప్యాక్: పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు నుదురు, మాడు లేదా మెడ మీద ఐస్ ప్యాక్ పెట్టుకోవటం మంచిది. దీంతో ఆయా భాగాలకు రక్తసరఫరా తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశముంది. తువ్వాలును చల్లటి నీటిలో ముంచి ఆయా భాగాల మీద పెట్టినా మంచి ఫలితం కనబడుతుంది.
- ఒకింత కాఫీ: దీనిలోని కెఫీన్ నొప్పి కాస్త తగ్గటానికి తోడ్పడుతుంది. పార్శ్వనొప్పికి వేసుకునే మందులను శరీరం త్వరగా గ్రహించటానికీ ఇది దోహదం చేస్తుంది. అయితే కాఫీని మితంగానే తీసుకోవాలి.
- ఇల్లు ప్రశాంతం: ప్రకాశవంతమైన వెలుతురు, పెద్ద పెద్ద శబ్దాలు తలనొప్పిని మరింత తీవ్రం చేస్తాయి. కాబట్టి ఇల్లు ప్రశాంతంగా, వెలుతురు అంతగా లేకుండా చూసుకోవటం మేలు. ఇవి తలనొప్పి, వికారం వంటివి కాస్త త్వరగా తగ్గటానికి తోడ్పడతాయి.
- వ్యాయామం: పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు వ్యాయామం చేయటం అంత మంచి పని కాదు. దీంతో నొప్పి మరింత పెరగొచ్చు. అయితే పార్శ్వనొప్పి లేని సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా తలనొప్పిని నివారించుకోవచ్చు. వ్యాయామం చేసినపుడు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లు, రసాయనాల వంటివి విడుదలవుతాయి. దీంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.
- మెగ్నీషియం: పార్శ్వనొప్పి నివారణకు మెగ్నీషియం బాగా తోడ్పడుతుంది. అందువల్ల మెగ్నీషియం దండిగా లభించే ముదురు ఆకుపచ్చ కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు.. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్) ఎక్కువగా తినటం మంచిది. అలాగే పాలు, చేపలు, కోడిమాంసంలోని రైబోఫ్లావిన్ కూడా పార్శ్వనొప్పి నివారణకు తోడ్పడుతుంది.
- నిద్ర:అతిగా నిద్ర పోయినా, నిద్ర తగ్గినా పార్శ్వనొప్పి ఉద్ధృతం కావొచ్చు. కాబట్టి రాత్రిపూట 7-8 గంటల సేపు నిద్రపోవాలి. అలాగే ఉదయం పూట రోజూ ఒకే సమయానికి నిద్రలేచేలా చూసుకోవాలి.
- యోగా:వ్యాయామంలో మాదిరిగా కాకుండా యోగా చేస్తున్నప్పుడు శరీర కదలికలు నెమ్మదిగా సాగుతాయి. ఇది మానసిక ప్రశాంతతనూ చేకూరుస్తుంది. యోగాతో పార్శ్వనొప్పి తరచుగా రావటం తగ్గుతున్నట్టు, ఒకవేళ నొప్పి వచ్చినా తీవ్రత తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
- ప్రేరకాలకు దూరం:కొన్నిసార్లు తినే ఆహార పదార్థాలు, చుట్టుపక్కల పరిసరాలు, ప్రకాశవంతమైన వెలుతురు, గాఢమైన వాసనల వంటివీ పార్శ్వనొప్పిని ప్రేరేపించే అవకాశముంది. ఇలాంటి కారకాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మంచిది.