మన శరీరమే మన వాహనం! శారీరక శ్రమ, వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇది చతికిల పడకుండా చూసుకోవటం ముఖ్యం. అంటే శరీరం చురుకుగా పనిచేయటానికి సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన ఆహారం, సరైన ద్రవాలు తీసుకోవటం తప్పనిసరి అన్నమాట. వ్యాయామంతో ఆరోగ్యం మెరుగవ్వడటం నిజమే గానీ దీనికి తిండి కూడా తోడైతేనే మంచి ఫలితం కనిపిస్తుంది. గుండెను బలోపేతం చేసేవి, బలానికి పరీక్ష పెట్టేవి, శరీరాన్ని సాగదీసేవి.. ఎలాంటి వ్యాయామాలతో కండరాలకు పని చెప్పినా అవి పోషణ కోసం మనం తినే ఆహారం మీదే ఆధారపడతాన్నది గుర్తుంచుకోవాలి. వ్యాయామాలకు ముందు, తర్వాతా. విరామం ఇచ్చినప్పుడూ నిరంతరం శరీరానికి పోషకాలు అందుతుండాలి. తగినంత సేపు వ్యాయామం చేయటం, అనుకున్న లక్ష్యాలను సాధించటం వంటివన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే గ్లూకోజు స్థాయులు గతి తప్పకుండా ఉండటానికి.. త్వరగా అలసిపోకుండా చూసుకోవటానికి.. వేగంగా కోలుకోవటానికి వ్యాయామాలకు ముందు, తర్వాత తగినంత ఆహారం, ద్రవాలు తీసుకోవటం తప్పనిసరి. దీని విషయంలో కఠినమైన నిబంధనలు, పద్ధతులంటూ ఏమీ లేవు. మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కాకపోతే కొన్ని ముఖ్యమైన సంగతులను తెలుసుకొని, ఆచరించటం మంచిది.
1 కసరత్తులకు ముందు ఏం తినాలి?
చాలామంది పరగడుపున కసరత్తు చేయాలని భావిస్తుంటారు. నిజానికి ఏదైనా కొద్దిగా తిన్న తర్వాత ఆరంభిస్తే ఎక్కువసేపు, ఉత్సాహంగా వ్యాయామాలు చేయొచ్చు. కండలు పెంచుకోవాలని అనుకునేవారికిది మరింత ముఖ్యం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటమంటే పెట్రోలు లేకుండా కారును నడపటం లాంటిదే అనుకోవచ్చు. మరేం తినాలి? తగినన్ని నీళ్లు తాగటం అన్నింటికన్నా ముఖ్యం. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూడటానికి నీళ్లు, ద్రవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పొట్టుతీయని ధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు తినటం మంచిది. ఉదాహరణకు- కార్న్ ఫ్లేక్స్ వంటివి వెన్న తీసిన పాలతో కలిపి తినొచ్చు. పొట్టుతో కూడిన గోధుమ టోస్ట్, పాస్తా, వెన్న తీసిన పెరుగు, దంపుడు బియ్యం అన్నం వంటివైనా తీసుకోవచ్చు. అరటి, యాపిల్, ఎండుద్రాక్ష వంటి పండ్లు తినొచ్చు. లేదూ వీటితో చేసిన గుజ్జు ద్రవాలు తాగొచ్చు. పీచుతో కూడినవి కాకుండా ఉడకబెట్టిన బంగాళాదుంపల వంటి కూరగాయలు తినొచ్చు. పీచుతో కూడినవైతే త్వరగా జీర్ణం కావు. ఇవి వ్యాయామం చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటివి ఏవైనా సరే.. వ్యాయామాలకు ముందు కనీసం అరగంట ముందుగా తీసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా తినటం తగదు. వీటిని జీర్ణం చేసుకోవటానికి శరీరం ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది మరి. ఇది వ్యాయామాలకు ఇబ్బంది కలిగిస్తుంది. కొందరు కసరత్తులు చేసేటప్పుడు శక్తినిచ్చే పానీయాలు తాగుతుంటారు. ఇది మంచిది కాదు. ఇవి గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకుల వంటివీ తీసుకోవద్దు. వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్ కూడా ఉంటుంది. ఇవి రెండిందాలా హాని చేస్తాయి.
2 పరగడుపున చేయొచ్చా?