ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత, పరిసరాల శుభ్రతకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రజలూ పరిశుభ్రత పాటిస్తున్నారు. అయితే కేవలం మనం, ఇంటి పరిసరాలే కాదు.. నిత్యం మనం వాడే కొన్ని వస్తువులను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. అవి ఏంటో మీకు తెలుసా?
కీబోర్టు, బెడ్షీట్లు శుభ్రత ముఖ్యం కంప్యూటర్ కీబోర్డు తుడుస్తున్నారా?
రోజూ చాలా మంది కంప్యూటర్‌ని ఉపయోగిస్తుంటారు. కంప్యూటర్ కీస్‌పై దుమ్ము, ధూళి చేరి కనిపించని బ్యాక్టీరియా ఉండొచ్చు. 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అపరిశుభ్రమైన కీబోర్డు కారణంగా కూడా మనుషులకి అంటువ్యాధులు సోకే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. రోజూ మీ కీబోర్డును ఎలక్ట్రానిక్స్-సేఫ్ క్లీనర్ లేదా ఆల్కాహాల్‌తో శుభ్రం చేయడం ఉత్తమం.
పరుపు శుభ్రం ఇలా...
మీ మంచం, పరుపుని రోజూ శుభ్రం చేయాలి. లేకపోతే దానిలో దాగున్న బ్యాక్టీరియా మీకు ప్రశాంతమైన నిద్రలేకుండా చేయడమే కాదు, మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అమెరిస్‌లీప్ చేసిన అధ్యయనం ప్రకారం, ఒక వారానికే మీ దిండు కవర్లలో మూడు మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని, అదే నెలాఖరులోగా 11.96 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడైంది. అందుకే, మీ మంచాన్ని ప్రతి రోజు శుభ్రం చేయడమే ఉత్తమం. కనీసం, వారానికి ఒకసారైనా మీ బెడ్‌షీట్లను ఉతకడం మంచిది.
బాటిల్, ఉంగరంపైనా వైరస్ వాటర్ బాటిల్ కడుగుతున్నారా?
మీరు ఉపయోగించే వాటర్ బాటిల్‌ను రోజు కడుగుతున్నారా? మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అలాంటి నీరు తాగే బాటిల్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నల్స్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. అందులో పెద్దవారు ఉపయోగించే వాటర్ బాటల్‌లలో ఒక మిల్లీలీటరుకు సగటున 75వేల బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. దాన్ని అలాగే శుభ్రం చేయకుండా వదిలేస్తే ఆ సంఖ్య ఒక రోజులోనే రెండు మిలియన్ల వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. రోజు మీ వాటర్ బాటిల్‌ని యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు, వేడి నీటితో కడగాలి. రోజూ శుభ్రపరచడం కష్టం అనుకుంటే రీసైకిల్ చేయడానికి వీలుగా ఉండే వాటర్ బాటిల్‌ను వినియోగించడం ఉత్తమం. లేకపోతే సహజసిద్ధంగా యాంటీ మైక్రోబయాల్ ప్రభావాన్ని కలిగి ఉన్న రాగి సీసాలను ఉపయోగించొచ్చు.
వేలి ఉంగరాల పరిస్థితేంటి?
మనం వేళ్లకు పెట్టుకునే ఉంగరాల వల్ల కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుందని మీకు తెలుసా? 2009లో ఓస్లో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉంగరాలు ధరించిన వారి చేతుల్లో బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఉంగరాలు ధరించిన వ్యక్తులు, ధరించని వారి కంటే రెండు రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. మీ ఉంగరాలను వేడి నీరు, యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు లేదా ఆభరణాల క్లీనర్ మిశ్రమంలో ఉంచడం ద్వారా వాటిని శుభ్రపరచవచ్చు.
ఫోను తుడుస్తున్నారా?
ఒక రోజులో ఎన్నో వందల సార్లు మీ ఫోనును తాకుతుంటారు. మరి మీ ఫోనును రోజూ శుభ్రం చేస్తున్నారా? హెల్త్‌కేర్ వర్కర్ల ఫోన్‌లపై చేసిన అధ్యయనాన్ని ఇరానియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీలో ప్రచురించింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది ఫోన్‌లలో ఆరు రకాల బ్యాక్టీరియా పెరుగుతుందని కనుగొన్నారు. అసినెటోబాక్టర్ బౌమన్నీ, యాంటీబయాటిక్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ అనేవి చాలా సాధారణంగా వచ్చేవే. అందుకే మీ ఫోనును తరచుగా ఆల్కహాల్‌తో శుభ్రపరచడం వలన బ్యాక్టీరియాను చంపవచ్చు.
స్టీరింగ్‌పై బ్యాక్టీరియా!
మీ స్టీరింగ్‌పై బ్యాక్టీరియా ఏముంటుందిలే.. ఎప్పుడూ శుభ్రం చేసేదేగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కార్‌రెంటల్. కామ్ చేసిన అధ్యయనం ప్రకారం, స్టీరింగ్ వీల్ మీద సెంటీమీటర్‌కు సగటున 629 కాలనీలను ఏర్పరచగల బ్యాక్టీరియా యూనిట్లు ఉంటాయని వెల్లడైంది. అంటే ఇది పబ్లిక్ టాయిలెట్ సీటు మీదున్న బ్యాక్టీరియా కంటే నాలుగు రెట్లు ఎక్కువన్నమాట! అందుకే మీ స్టీరింగ్ వీల్‌ని క్రమం తప్పకుండా ప్రతిరోజు శుభ్రపరచాలి.
రిమోట్ క్లీనింగ్ తప్పనిసరి కాఫీ కప్పు పూర్తిగా కడుగుతున్నారా?
దాదాపుగా 20శాతం మంది వారు తాగిన కాఫీ కప్పుని నీటితో కడిగి పక్కన పెట్టేస్తుంటారు. దీని ద్వారా అందులో ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ చార్లెస్ గెర్బా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మీరు మీ కాఫీ కప్పులని పాత్రలు కడిగే సబ్బు, వేడి నీటితో కడగడం మంచిది.
స్పాంజులు బ్యాక్టీరియాల నిలయాలు
ఇంట్లోని వంట గదిని, ఇతర గదులను శుభ్రం చేయడానికి, పాత్రలను శుభ్రం చేయడానికి స్పాంజులను ఉపయోగిస్తుంటాం. అయితే, ఈ స్పాంజులను రోజూ శుభ్రం చేయకపోతే మీరు పడ్డ శ్రమంతా వృథానే. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ మైక్రోబయాలజీలో ప్రచురించిన పరిశోధనల ప్రకారం, వంటగది స్పాంజులలో ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటాయని, మీరు వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తికి కారణం అవుతాయని వెల్లడైంది. వీటిని రోజూ ఒకటి లేదా రెండు నిమిషాలు వేడి నీటిలో మరిగించడం వలన బ్యాక్టీరియాను చంపొచ్చు.
రిమోట్ తుడుస్తున్నారా?
మీ ఇంట్లో ఉన్న టీవీ, ఏసీ రిమోట్ కంట్రోల్‌లను తుడుస్తున్నారా? అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ సర్వసభ్య సమావేశంలో సమర్పించిన పరిశోధన నివేదికలో హోటల్ గదులలో రిమోట్ కంట్రోల్స్ చాలా సూక్ష్మక్రిములతో నిండి ఉన్నాయని వెల్లడైంది. వీరు అధ్యయనం చేసిన 81 శాతం రిమోట్లలో బ్యాక్టీరియా ఉందని పేర్కొన్నారు. రోజూ పడుకునే ముందు ఆల్కహాల్ లేదా యాంటీ బాక్టీరియల్‌తో తుడవడం వల్ల వీటిని సులభంగా శుభ్రం చేయొచ్చు.
డోర్ హ్యాండిల్, టవల్పైనా బ్యాక్టీరియా తలుపు హ్యాండిల్ తాకుతున్నారా?
మీరు ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా లేదా ఇంట్లోనున్న ఏ గదిలోకి వెళ్లాలన్నా తలుపు హ్యాండిల్స్‌ని ముట్టుకోకుండా తీయగలరా? అదెలా? అసాధ్యం కదా. ప్రతి సారి తలుపులకున్న హ్యాండిల్స్ తాకుతూ ఉంటే ఎక్కువ బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఉన్నాయి. కాంటినెంటల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 180 తలుపుల హ్యాండిల్స్‌ని పరిశీలించగా అందులో 87శాతం హ్యాండిల్స్‌పై బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది. అందుకే రోజూ మీ తలుపులకున్న హ్యాండిల్స్‌ని యాంటీబాక్టీరియల్ క్లీనర్లతో శుభ్రం చేయడం వల్ల వాటిని నివారించవచ్చు.
టవల్‌ని ఉతుకుతున్నారా? ఆరబెడుతున్నారా?
మీరు స్నానం చేశాక తుడుచుకున్న టవల్‌ని ఉతుకున్నారా? ఏమీ కాదులే అని ఆరబెట్టి వదిలేస్తున్నారా? 90శాతం టవల్‌లో బ్యాక్టీరియా ఉంటుందని డాక్టర్ గెర్బా పరిశోధనలో పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా రింగ్ వామ్, ఇంపెటిగో లాంటి చర్మ సంబంధ వ్యాధులు వస్తాయని వెల్లడైంది. రోజూ మీ టవల్‌ని కాసేపు వేడి నీటిలో నానబెట్టి ఉతకడం వల్ల బ్యాక్టీరియాను నివారించవచ్చు.
బ్రెష్‌ని శుభ్రం చేసుకోండిలా బాత్ రూమ్ సింక్‌ని శుభ్రం చేస్తున్నారా?
మీ బాత్ రూమ్ సింక్‌నే కాదు, రోజూ దాని చుట్టూ ఉన్న పరిసరాలని కూడా శుభ్రం చేయాలి. ట్రావెల్ మౌత్ ఇటీవల నిర్వహించిన పరిశోధనల ప్రకారం, హోటల్ గదుల్లోని బాత్ రూమ్ చుట్టూ ఉన్న పరిసరాలలో సగటున 1,288,817 కాలనీలను బ్యాక్టీరియాలు ఏర్పాటు చేస్తాయని వెల్లడైంది. నిత్యం శుభ్రపరిచే హోటల్ సింక్‌ల పరిస్థితే ఇలా ఉంటే, మన ఇంట్లో ఉండే సింక్‌ల గురించి ఓ సారి ఆలోచించండి. రోజూ బ్లీచింగ్ కలిపిన నీటితో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియాను క్షణాల్లో చంపేయొచ్చు.
టూత్ బ్రష్ శుభ్రం చేయండిలా...
మనం రోజు వాడే టూత్ బ్రష్‌పై బ్యాక్టీరియా ఎక్కువగానే ఉంటుంది. నర్సింగ్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, టూత్ బ్రష్‌లలో మామూలుగానే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని, వాటికి బాత్ రూమ్‌లోనే ఉంచడం వల్ల వాటిపై క్యాప్‌లను ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుందని వెల్లడైంది. ప్రతి రోజూ మీ బ్రష్‌ని యాంటీబాక్టీరియల్ మౌత్ వాష్‌లో నానబెట్టడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.
బ్యాక్టీరియాకు నిలయం వంటగది వంటగది పరిసరాలు శుభ్రం చేస్తున్నారా?
మీ వంటగది పరిసరాలను బాగా శుభ్రం చేయాలి. నేషనల్ శానిటేషన్ ఫౌండేషన్(ఎన్‌ఎస్‌ఎఫ్) చేసిన పరిశోధనల ప్రకారం.. ఇంటి మొత్తంలో ఉన్న బ్యాక్టీరియా కంటే వంట గదిలో 30 శాతం కంటే ఎక్కువ హాని కరమైన బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. రోజు కొద్దిగా సబ్బు, బ్లీచింగ్ కలిపిన నీటితో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియాను తొలగించవచ్చు.
కిటికీలు తెరుస్తున్నారా?
వేసవికాలంలో ఎండ వేడిని భరించలేక మనం కిటికీలు తెరుస్తుంటాం. అయితే అలా తెరవడం వల్ల బయట నుంచి ఎక్కువ దుమ్మూ ధూళి ఇంట్లోకి చేరే అవకాశం ఉంది. వీటిలోని బ్యాక్టీరియా అలర్జీ, ఉబ్బసం లాంటి వ్యాధుల బారిన పడేలా చేయొచ్చు. అందుకే రోజు మీ కిటికీలను శుభ్రంగా తుడవడం మంచిది.