హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు మనలో కనిపించే కొన్ని లక్షణాలను ముందే గమనించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని, తద్వారా ఈ సమస్య నుంచి బయటపడచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ లక్షణాలేంటో మనమూ తెలుసుకుందామా..
హార్మోన్ల అసమతౌల్యానికి సంకేతాలివే..!
By
Published : Aug 1, 2020, 5:42 PM IST
26ఏళ్ల పద్మకి పెళ్త్లె నాలుగు సంవత్సరాలవుతోంది. గత రెండేళ్లుగా పిల్లల కోసం ఆ దంపతులు వైద్యుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. 18ఏళ్ల స్మైలీకి నెలసరి సక్రమంగా రావడం లేదు. వైద్యులను సంప్రదిస్తే హార్మోన్ల అసమతౌల్యం కారణంగా అలా జరుగుతుందని చెప్పారు..!
వీరే కాదు.. ఈరోజుల్లో చాలామంది మహిళలు హార్మోన్ల అసమతౌల్యం సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. ఇందుకు కారణం అయినప్పటికీ వీటి ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు మనలో కనిపించే కొన్ని లక్షణాలను ముందే గమనించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని, తద్వారా ఈ సమస్య నుంచి బయటపడచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ లక్షణాలేంటో మనమూ తెలుసుకుందామా..
స్త్రీలలో ప్రతినెలా వచ్చి పలకరించే నెలసరి, పెరిగే వయసు, మెనోపాజ్.. వంటి కారణాల వల్ల హార్మోన్ల సమతుల్యతలో తేడా వచ్చే అవకాశాలున్నాయి. ఇవే కాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సైతం హార్మోన్ల స్థాయులపై ప్రభావం చూపించడం వల్ల కూడా హార్మోన్ల అసమతౌల్యం సమస్య తలెత్తవచ్చు. సాధారణంగా హార్మోన్ల స్థాయుల్లో అసమతౌల్యం వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
అవి;
తలనొప్పి..
సాధారణంగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌పై ఆధారపడి ఉంటాయి. మెదడులో నొప్పికి సంబంధించిన సంకేతాలు వెలువడకుండా అదుపు చేయడంలో దీని పాత్ర చాలా ముఖ్యమైంది. అందుకే ఈస్ట్రోజెన్ స్థాయుల్లో ఏమాత్రం మార్పు వచ్చినా తలనొప్పి లేదా మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
బరువు పెరగడం..
బరువు పెరగకుండా ఉండాలని.. లేదా బరువు ఎక్కువగా తగ్గాలని.. ప్రస్తుతం ఎవరిని చూసినా ఈ రెండింట్లో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటున్నారు. మీరూ అంతేనా?? అసలు మీరు ఇంతగా బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా?? అందుకు హార్మోన్ల స్థాయుల్లో వచ్చే మార్పులు కూడా కావచ్చంటున్నారు వైద్యులు. దీనికి తోడు శరీరానికి సరైన శ్రమ లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం.. వంటివి కూడా బరువు పెరిగేందుకు మరింత దోహదం చేస్తాయి. కాబట్టి మీరు బరువు పెరిగినట్లుగా గమనిస్తే అందుకు గల కారణాలను కూడా వెంటనే తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నిద్ర పట్టడం లేదా??
మీరు బాగా ఒత్తిడికి గురవుతున్నారా?? అయితే వెంటనే జాగ్రత్తపడాల్సిందే.. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో పెరిగే కార్టిసాల్ స్థాయులు నేరుగా హార్మోన్ల సమతౌల్యతపై ప్రభావం చూపిస్తాయట! ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టదు.
చెమట పడుతోందా?? వాతావరణం మరీ వేడిగా ఉన్నప్పుడు చెమటలు పట్టడం సహజం. అలాకాకుండా కొందరికి వాతావరణంతో సంబంధం లేకుండా విపరీతంగా చెమటలు పడుతుంటాయి. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అతిగా ఆందోళన చెందడం, భయపడడం.. వంటి కారణాల వల్ల ఇలా చెమటలు పడుతుంటే మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిందే. చెమటతో పాటు దుర్వాసన కూడా వస్తే అది హార్మోన్ల స్థాయుల్లో వస్తున్న మార్పులకు సంకేతమని గుర్తించాలి.
జీర్ణ సంబంధిత సమస్యలా??
గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ నెమ్మదించడం.. మొదలైన సమస్యలు కూడా హార్మోన్ల స్థాయుల్లో వచ్చే మార్పులకు సంకేతాలేనట! అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిగ్గా నమలకపోవడం, మరీ అతిగా ఆహారం తీసుకోవడం.. వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అందుకు గల కారణాలు అన్వేషించడం మంచిది.
మూడ్‌స్వింగ్స్..
హార్మోన్ల స్థాయుల్లో మార్పులు వచ్చినప్పుడు ఆత్రుత ఎక్కువగా ఉండడం, అతిగా చిరాకు పడడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం.. ఇలా అన్నీ అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయి. అంటే కాస్త సమయంలోనే మన మూడ్ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. వీటినే మూడ్‌స్వింగ్స్‌గా పరిగణిస్తారు. సరైన కారణాలు లేకుండా అప్పటికప్పుడు మీ మూడ్ కూడా ఇలా మారుతూ ఉంటే హార్మోన్ల స్థాయులు ఒకసారి చెక్ చేయించుకోవాల్సిందే..!
ఈ లక్షణాలు కూడా..
అప్పటికప్పుడు ఏదైనా ఆహారం తినాలనిపించడం..
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించకపోవడం..
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం..
ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండడం..
అప్పటికప్పుడు మర్చిపోవడం..
మహిళల రొమ్ముల్లో మార్పులు చోటుచేసుకోవడం..
జుట్టు ఎక్కువగా రాలిపోవడం..
చర్మ ఆరోగ్యం దెబ్బతినడం..
మొటిమలు రావడం..
కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడడం.. మొదలైనవి కూడా హార్మోన్ల అసమతౌల్యాన్ని సూచించే లక్షణాలే!
సాధారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు శరీరం దానంతట అదే తిరిగి బాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది సాధ్యం కాని పక్షంలో క్రమపద్ధతి లేని నెలసరి, కడుపునొప్పి, మూడ్‌స్వింగ్స్.. మొదలైన వాటి ద్వారా సమస్య సంకేతాలను పంపుతుంది. కాబట్టి ఇకపై ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు ముందే చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు.