వ్యాయామం చేస్తున్నాం. లేదూ బాస్కెట్‌బాలో, వాలీబాలో ఆడుతున్నాం. కాస్త వేగంగా పరుగెత్తుతున్నాం. ఇలాంటి సమయాల్లో ఒకోసారి పక్కటెముకల వద్ద హఠాత్తుగా తీవ్రమైన నొప్పి పుడుతుంటుంది. దీంతో కొన్నిసార్లు ఆయా పనులను ఆపేస్తుంటాం కూడా. దీన్ని చాలామంది పక్కటెముక పట్టేసిందని భావిస్తుంటారు. ఇది ప్రమాదకరమైందేమీ కాదు. తరచూ చూసేదే. రోజువారీ పనులకు ఇబ్బందేమీ కలిగించదు. కానీ నొప్పి ఉన్నంత సేపు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకీ దీనికి కారణమేంటో తెలుసా? కడుపును ఛాతీని వేరు చేసే డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం.
డయాఫ్రం పొర ఉన్నట్టుండి సంకోచించటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కాలేయానికి, ప్లీహానికి రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తుంటారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చనీ అనుకుంటుంటారు. తిన్న వెంటనే శారీరక శ్రమ చేయటం కూడా డయాఫ్రం పొర సంకోచించటానికి దారితీయొచ్చు. ఎందుకంటే తిన్న తర్వాత ఆహారం జీర్ణం కావటానికి శరీరం జీర్ణాశయానికి రక్త సరఫరాను ఎక్కువ చేస్తుంది. ఫలితంగా డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గుతుంది. రక్తంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల మోతాదులు తగ్గటమూ కారణం కావొచ్చు.