Belly fat loss tips:కొవ్వు అనేది చాలా మందికి ఉండే సమస్యే. అలాగని దాన్ని తేలికగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా కారణమేదైనా శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం మంచిది కాదు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటిస్తో పాటు కొన్నిరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదమూ ఉంది. అందువల్ల పొట్ట రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తినే తిండిని నియంత్రణలో పెట్టుకుంటే పొట్ట కొవ్వును సగం దూరంపెట్టినట్టే! ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు.
వీటిని దూరం పెట్టాల్సిందే..!
వేపుళ్లు...:కెలొరీలు ఎక్కువగా ఉండే ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన ప్రక్రియ. దాంతో ఊబకాయం, మధుమేహం, మరికొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వేపుళ్లకు దూరంగా ఉండాలి.
చక్కెర ద్రవాలకూ...:మనం తాగే సోడా, శీతల పానీయాలు, మార్కెట్లో దొరికే పండ్లరసాల్లో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా. వీటి నుంచి తక్కువ కెలొరీలు లభిస్తాయి. అయితే చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది పొట్టకే కాదు కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. ఇది అనారోగ్యానికి సంకేతం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఉప్పు...:
పొట్ట పెరగడానికి ఉప్పు ఎక్కువగా తినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది సమస్యే కదా. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.
ఇవి తినండి!
యాపిల్...:రోజూ ఓ యాపిల్ తింటే మీ పొట్ట తగ్గుతుంది! ఈ పండులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వులను కరిగిస్తుంది.