Raw sprouts or boiled sprouts Which is best :మొలకలు తినడం వల్ల కలిగే లాభాలను చూస్తే.. వాటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అంతేకాదు.. పీచు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య నివారణకు తోడ్పడుతుంది. ఇంకా ఇందులో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉన్నాయి.
మొలకల్లో చాలా రకాలు..
మొలకలు అంటే.. చాలా మంది పెసర్ల నుంచి వచ్చేవే తింటారు. కానీ.. ఇంకా చాలా రకాల మొలకలు ఉంటాయి. బీన్స్, బఠానీలు, శనగలు, వేరు శనగలతోపాటు తృణధాన్యాల మొలకలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ మొలకలను తీసుకోవడం ద్వారా.. శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును చాలా మెరుగుపడుతుంది.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది..
ఈ మొలకల ద్వారా శరీరంలోని హెచ్‌డిఎల్ (హై-డెన్సిటీ లిపోప్రొటీన్) స్థాయి పెరుగుతుంది. అంటే.. బాడీలో 'మంచి కొలెస్ట్రాల్' పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇలా.. మొలకలు తినడం ద్వారా మంచి ఆరోగ్యం అందుతుంది. అయితే.. అతిగా తినడం మంచిది కాదు. వారంలో రెండు నుంచి మూడు రోజుల్లో కొద్దిగా తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
మొలకలు ఎలా తినాలి?
ఆరోగ్యం కోసం మొలకలు తినడం ఎంత ముఖ్యమో.. ఆ మొలకలను ఎలా తినాలి? అన్నది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. దాదాపుగా అందరూ.. ఒక రోజంతా నానబెట్టి, ఆ తర్వాత వస్త్రంలో చుట్టి, మొలకలు వచ్చిన తర్వాత వాటిని తినేస్తారు. అయితే.. ఇలా తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చెప్పడానికి చాలా కారణాలున్నాయట. వస్త్రంలో చుట్టిన మొలకల్లో సాల్మొనెల్లా, ఇ.కోలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందట.
"జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్"లో ఈ మేరకు ఒక అధ్యయనం పబ్లిష్ చేశారు. పచ్చి మొలకల్లో E.coli, ఇతర హానికరమైన బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా ఉంటాయని.. వీటిని ఉడికించి తినడం ద్వారా వాటి ప్రభావం చాలా వరకు తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారట.
ఈ సమస్యలు వస్తాయి..
మొలకలను పచ్చిగానే తినడం వల్ల పలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు వేధించవచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వారు ఇవి తింటే.. జీర్ణం కావడం చాలా కష్టమని అంటున్నారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధుల విషయంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా.. వాంతులు, విరేచనాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందట.
ఎలా తినాలి?
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. మొలకలను కాస్త ఉడికించి తినడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా జీర్ణ క్రియ సాఫీగా సాగుతుందట. ఉడికించడం వల్ల అందులోని ప్రమాదకర బ్యాక్టీరియా నశిస్తుందని చెబుతున్నారు. అజీర్తి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అంటున్నారు. అయితే.. మొలకలను వేడి చేయడం వల్ల విటమిన్ C వంటి కొన్ని పోషకాలు కూడా నష్టపోతారు. అందువల్ల.. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి.. మొలకలను ఎలా తీసుకోవాలి అన్నది నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.