తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పీరియడ్స్ వాయిదా కోసం మందులు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! - నెలసరి సమస్యలు న్యూస్

Periods Delay Tablets Side Effects In Telugu : ఏదైనా పర్యటక ప్రదేశాలకు వెళుతున్నప్పుడు, పండగలు, ఫంక్షన్లు ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చే అవకాశముంటే అవి రాకుండా చాలా మంది మహిళలు మందులు వాడతారు. కొందరైతే అతిగా వాడతారు. నెలసరి వాయిదా వేసే మందుల్ని ఎలా వాడాలి, ఇవి ఎలా పనిచేస్తాయి, తరచూ వాడొచ్చా, అతిగా వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి లాంటి విషయాలు ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Periods Delay Tablets Side Effects In Telugu
Periods Delay Tablets Side Effects In Telugu

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 9:27 AM IST

Periods Delay Tablets Side Effects In Telugu :ఇంట్లో పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు, పండగల సమయంలో, దేవాలయాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా మంది మహిళలు నెలసరిని వాయిదా వేసే మందుల్ని వాడుతుంటారు. వైద్యుల సలహా లేకుండానే మెడికల్ షాపు నుంచి సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే ఇలా నెలసరిని బలవంతంగా వాయిదా వేసుకోవడం, దీనికోసం తరచూ మందుల్ని వాడటం అనేది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నెలసరి వాయిదా వేసే మందుల్ని అతిగా వాడటం వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తే అవకాశముందో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

అసలీ మందులు ఎలా పనిచేస్తాయి ?
మహిళ శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ అనే రెండు రకాల హార్మోన్లు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్​గా వచ్చే మహిళల్లో మొదటి 15 రోజుల వరకు ఈస్ట్రోజెన్ పనిచేస్తుంది. అండం విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. వీటి లెవల్స్ 22వ రోజున బాగా పెరిగి తర్వాత తగ్గుముఖం పడతాయి. దీన్ని ప్రొజెస్ట్రాన్ విత్​డ్రా అంటారు. శరీరంలోని ప్రొజెస్ట్రాన్ లెవల్స్ మొత్తం తగ్గిపోయాక పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది.

కాబట్టి పీరియడ్స్​ను పోస్ట్ పోన్ చేయడానికి ఈ లెవల్స్ తగ్గకుండా చూసుకోవాలి. దీనికి ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్స్ వాడాలి. వీటికి సంబంధించి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిని రోజుకి రెండు సార్లు 10mg డోస్ చొప్పున వాడాలి. గరిష్ఠంగా 14 రోజుల వరకు వేసుకుని నెలసరిని వాయిదా వేయొచ్చు. వీటి వాడకం ఆపినప్పుడు హార్మోన్ లెవెల్ తగ్గి పీరియడ్స్ వస్తాయని గైనకాలజిస్ట్ డా. మాధురి తెలిపారు.

పండగలు, శుభకార్యాల సమయంలో వీటిని వాడొచ్చా ?
సాధారణంగా ఇలాంటి సమయాల్లో పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయడానికి మహిళలు ఆ మందుల్ని వాడతారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే డీప్ విన్ త్రాంబోసిస్ (డీవీటీ), బాగా మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్లు, ప్రొజెస్ట్రాన్ ఇన్ టాలరెన్స్ ఉన్న ఆడవాళ్లు వీటిని వేసుకుంటే వాంతులు, ఒత్తిడి పెరగడం లాంటి ఇబ్బందులు తెలెత్తుతాయి.

వీటిని తరచూ వాడొచ్చా ?
వీటిని వాడటం వల్ల మూడ్ స్వింగ్స్ ఉండటం, కోపం, ఒత్తిడి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పేగుల మీదా కూడా వీటి ప్రభావం ఉంటుంది. టీనేజ్ గర్ల్స్ వీటిని తరచూ వాడితే ఆస్టియోపోరిసిస్ సంభవిస్తుంది. అంటే ఎముకల్లోని కాల్షియం తగ్గిపోతుంది. డీవీటీ (నరాల్లో రక్తం గడ్డ కట్టడం) ఉన్న మహిళలు పూర్తిగా ఈ మందులకు దూరంగా ఉండాలి. ఒకవేళ వాడాలనుకుంటే అంతకంటే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.

మందుల వాడకం ఎలా ఉండాలి ?
రెగ్యులర్​గా పిరీయడ్స్ వచ్చే మహిళల్లో బహిష్ఠుకు 3 రోజుల ముందు నుంచే వీటిని వాడటం ప్రారంభించాలి. రోజుకు రెండు పూటలా వాడాలి. అది కూడా ఒకే సమయానికి వాడితే బాగా పనిచేస్తాయి. ఉదా: ఉదయం 8కి తీసుకుంటే రాత్రి కూడా 8 గంటలకు తీసుకోవాలి. డోస్​ను అస్సలు మిస్ చేయొద్దు. ఒకవేళ డోస్ మిస్సయితే పీరియడ్స్ వచ్చే ఛాన్సుంది. 3 రోజుల ముందు ప్రారంభించి పోస్టోపోన్ ఎప్పటి వరకు చేయాలనుకుంటున్నారో అప్పటి వరకు వాడుకోవచ్చు. గరిష్ఠంగా 14 రోజుల వరకు మాత్రమే వాడుకోవచ్చని గుర్తుంచుకోండి.

సొంతంగా కొనుగోలు చేసి వాడుకోవచ్చా ?
ఈ మందులే కాదు వేరే సమస్యలకు సంబంధించిన మెడిసిన్ కూడా సొంతంగా కొనుగోలు చేయకూడదు. ముందుగా వెళ్లి మీకు దగ్గర్లోని గైనకాలజిస్టు దగ్గరికెళ్లి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎంత వరకు అవసరం, ఎంత డోస్ కావాలి తదితర వివరాలు చెబితే వారు సరైన మందుల్ని సూచిస్తారు.

నెలసరి ముందే వచ్చేందుకు ఏవైనా మందులున్నాయా ?
శరీరంలో ప్రొజెస్ట్రాన్ ఉన్నంత కాలం పీరియడ్స్ ప్రీ పోన్ చేయడం కష్టం. మందులు వేసుకున్నా అంతగా పనిచేయవు. అయినప్పటికీ ఎక్కువ డోస్​లో రోజుకి 3 పూటల చొప్పున 3 రోజుల పాటు వాడితే ప్రొజెస్ట్రాన్ లెవల్ బాగా పెంచి వెంటనే విత్ డ్రా చేస్తే పీరియడ్స్ వచ్చే అవకాశముంది.

నోట్ - వైద్యుల సలహా లేకుండా ఈ మందుల్ని అతిగా వాడితే ఆరోగ్యం దెబ్బతినటం సహా రుతుచక్రం గాడితప్పి లేనిపోని సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.

పీరియడ్స్ వాయిదా కోసం మందులు వాడుతున్నారా?

పీరియడ్స్‌కు ముందు జననాంగంలో నొప్పా? కారణాలు ఇవే!

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే పిల్లలు పుట్టరా? సెక్స్​కు వయోపరిమితి ఉంటుందా?

ABOUT THE AUTHOR

...view details