Over Good Behaviour : దయ, సానుభూతి లక్షణాలు కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. ఇది మీ ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. కానీ.. ఈ మంచి హద్దులు దాటితే మాత్రం పరిస్థితులు మారిపోతాయి. ఈ ప్రపంచం మీతో ఆడుకుంటుంది! మిమ్మల్ని మీరే ఒత్తిడిలోకి నెట్టేసుకుంటారు! మానసిక ఆందోళనలు చుట్టు ముడతాయి! చివరకు జీవితంలో ప్రశాంతత కరవైపోతుంది! మీరు కూడా అతి "మంచి వారేనా?" అయితే ఈపాటికే ఈ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండొచ్చు! వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓవర్ కమిట్మెంట్..
మితిమీరిన మంచితనం ఉన్నవారు.. ఓవర్ కమిట్ మెంట్ ఇస్తారు. ఎవరు ఏం అడిగినా సరే.. మొహమాటంతో "ఓకే" చెప్పేస్తుంటారు. ఆ తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఇలా.. తాము చేయగలిగే దానికంటే ఎక్కువ బాధ్యతలను మోస్తుంటారు. అంతిమంగా ఇది వారి మెంటల్ స్ట్రెస్‌కు దారితీస్తుంది.
హద్దులు గీయలేరు..
అతి మంచితనం ఉన్నవారు ఇతరులను ఎంత వరకు ఉంచాలి? వారితో మనం ఎంత వరకు ఉండాలి? అనే హద్దులు గీసుకోలేరు. ఎదుటి వారి కోసం ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు. దీనివల్ల సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత టైమ్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా.. ప్రతిఒక్కరూ వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
అతి ఉద్వేగాలు..
సొంత పనులకన్నా.. ఇతరుల అవసరాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. వారికన్నా వీళ్లే ఎక్కువగా ఉద్వేగానికి గురవుతారు. ఆ విధంగా.. సొంత భావోద్వేగాలను అణచుకుంటారు. ఇది కాల క్రమంలో.. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడానికి అవకాశం ఉంది.
సంబంధాలు దెబ్బతింటాయి..
అతి మంచితనం లక్షణంతో బయటి వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. సొంత వారికి ప్రయారిటీ తగ్గిస్తారు. ఇది ఒకటీ రెండు సార్లు కాదు.. ఇదొక అలవాటుగా మారిపోతుంది. ఆ విధంగా ఇంట్లో వాళ్ల ప్రయారిటీ ఎప్పుడూ సెకండ్ ప్లేస్ కే పరిమితమవుతుంది. దీంతో.. వారిలో ఒక అసహనం మొదలవుతుంది. ఈ పరిస్థితి ముదిరితే కుటుంబ సంబంధాలు సైతం దెబ్బతినే అవకాశం ఉంది.
సమస్యల్లో చిక్కుకుంటారు..
"మంచికి వెళ్తే చెడు ఎదురైంది" అనేమాట మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి ఘటనల్లో అతి మంచివారే ఎక్కువగా బాధితులై ఉంటారు! వెనకొచ్చే ఆపదను గుర్తించకుండా.. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఇలా.. నష్టాన్ని గుర్తించేలేక దెబ్బతింటారు.
NO చెప్పడం ప్రాక్టీస్ చేయండి..
ప్రతి దానికీ హద్దు ఉంటుందని గుర్తించండి. సహాయం చేయడానికి కూడా ఓ పరిమితి ఉంటుంది. దాన్ని దాటి ముందుకు వెళ్లకూడదు. హద్దు దాటితో వ్యక్తిగతంగా ఇబ్బంది పడడంతోపాటు ఒక్కోసారి కుటుంబం మొత్తం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి.. మీ స్థాయికి మించిన పని చేయాల్సి వస్తే.. నిర్మొహమాటంగా NO చెప్పండి. ఇది ఉన్నట్టుండి అలవాటు కాకపోవచ్చు.. ప్రాక్టీస్ చేయండి.
క్లియర్‌గా చెప్పండి..
అవతలి వారు తమ అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా అడగొచ్చు. దేనికోసమైనా సహాయం కోరొచ్చు. కానీ.. మీకు ఎంత వరకు చేతనవుతుందో మీకు మాత్రమే తెలుసు. కాబట్టి.. మీ పరిస్థితి ఏంటో.. ఎంత వరకు చేయగలరో.. అసలు చేయగలరో లేదో.. క్లియర్‌గా చెప్పండి. వీలైతే అందుకుగల కారణాన్నీ చెప్పండి. పర్ఫెక్ట్గా కమ్యునికేట్ చేయడం ద్వారా.. మనస్పర్థలు రాకుండానే.. మీరు అతి భారం మోయకుండానే బయటపడొచ్చు.
హెల్ప్ తీసుకోండి..
ఒకవేళ అతి మంచితనం నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థంకాకపోతే.. తెలిసిన వారి సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ఎంతకీ కుదరకపోతే మానసిక నిపుణులతో మాట్లాడండి. ఈ విధంగా.. NO చెప్పడం ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా.. ఆ ఊబిలోంచి బయటపడతారు.