తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నడుం నొప్పా? అది మానసిక ఒత్తిడేమో! - backpain

అకారణంగా నడుంనొప్పి, మెడనొప్పి వంటివి వస్తున్నాయా? అయితే దానికి కారణం మానసిక ఒత్తిడి కావచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు విడుదలయ్యే కార్టిజోల్ అనే హార్మోన్ ఈ నొప్పులకు కారణమవుతోంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి?

mental-stress-causing-back-pain
నడుం నొప్పా? మానసిక ఒత్తిడేమో!

By

Published : Dec 28, 2020, 2:50 PM IST

నడుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనేవే గుర్తుకొస్తాయి. అవే కానక్కర్లేదు. మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు రావొచ్చు! మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. నిజానికిది ఆయా పరిస్థితులు, ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి తోడ్పడేదే అయినా నిరంతరం ఉత్పత్తి అవుతూ వస్తుంటే మాత్రం ముప్పు తప్పదు. ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికి దారితీస్తుంది. దీంతో వెన్నెముక మీద భారం పెరుగుతుంది. అందుకే మగవారిలో చాలామందిలో ఒత్తిడి నడం నొప్పితోనే బయటపడుతుంటుంది. ఆడవారిలో కొందరిలో వీపు పైభాగాన, భుజాల వద్ద, మెడ వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది. ఇది తలనొప్పులకు దారితీస్తుంది.

పిల్లల్లోనూ..

ఒత్తిడి మూలంగా తలెత్తే నొప్పులు చిన్న పిల్లలనూ వదలటం లేదు. ముఖ్యంగా మెడ, వీపు మధ్య నొప్పులు వేధిస్తుంటాయి. చాలామంది వీటిని మొబైల్‌ ఫోన్ల వాడకంతో వచ్చాయని భావిస్తుంటారు గానీ కాస్త లోతుగా పరిశీలిస్తే అసలు కారణం తెలుస్తుంది. కాబట్టి అకారణంగా నడుం నొప్పి, మెడ నొప్పి వేధిస్తున్నట్టు గమనిస్తే ఒత్తిడికి గురవుతున్నారేమో కూడా ఒకసారి చూసుకోండి. యోగా, ధ్యానం వంటి పద్ధతులతో తేలికగానే ఎవరికి వారు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి :బాలల్లోనూ హై బీపీ.. భద్రం సుమా!

ABOUT THE AUTHOR

...view details