Knee Joint Pain Exercise: మోకాళ్ల నొప్పులనగానే వృద్ధులే గుర్తుకొస్తారు. నిజమే.. వయసు మీద పడుతున్నకొద్దీ కీళ్లు అరగటం, నొప్పులు తలెత్తటం మామూలే. కానీ చిన్నవయసులో తలెత్తే మోకాళ్ల నొప్పులు వేరు. ఇందులో కీళ్లు బాగానే ఉంటాయి. నిల్చున్నా, నడిచినా ఇబ్బంది ఉండదు. కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి దిశగా, వ్యతిరేకంగా పనులు చేస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది. అంటే కుర్చీలో గానీ కిందగానీ కూర్చుంటున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు.. మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు.. వాలుగా ఉన్న ర్యాంప్‌ల వంటి ఎత్తులను ఎక్కుతున్నప్పుడు నొప్పి పుడుతుంటుంది. దీన్నే పటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. మన మోకాళ్ల ముందు భాగాన చిప్ప (పటెల్లా) ఉంటుంది. మందంగా, సమతలంగా, త్రిభుజాకారంలో ఉండే ఇది కీళ్లు తేలికగా కదలటానికి, దెబ్బతినకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇందులో చిన్న సమస్య మొదలైనా నొప్పి తలెత్తుతుంది. ఒకరకంగా దీన్ని జీవనశైలి సమస్య అనుకోవచ్చు. గంటలకొద్దీ కుర్చీలో కూర్చొని ఉద్యోగాలు చేయటం, చదువుకోవటం.. కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు కాస్త వెనక్కి జరిపి ఉంచటం.. వంటివన్నీ మనకు తెలియకుండానే మోకాలి చిప్ప మీద ఒత్తిడి పడేలా చేస్తాయి. ఎప్పుడో అప్పుడంటే ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ రోజూ అదేపనిగా ఒత్తిడి పడుతుంటే చిప్ప లోపలి భాగం అరగటం ఆరంభిస్తుంది. క్రమంగా నొప్పికి దారితీస్తుంది. అందుకేనేమో ఇది సాఫ్ట్‌వేర్, డెస్క్ ఉద్యోగులు, విద్యార్థుల వంటివారిలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఎందుకొస్తుంది?
ఒకే తరహా పనులను పదే పదే చేసేవారికి చిప్ప అరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి పనులతో కీళ్ల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది చిప్పను లోపల్నుంచి చికాకుకు గురిచేసి, క్రమంగా దెబ్బతీస్తూ వస్తుంది. అందుకే రన్నింగ్, జంపింగ్ వంటి ఆటలు ఆడేవారిలో చిప్ప నొప్పులు ఎక్కువ. కుర్చీలోంచి లేవకుండా గంటల తరబడి అలాగే కూర్చోవటమూ చిప్ప మీద ఒత్తిడి పెంచొచ్చు. మోకీళ్లు సరైన స్థితిలో ఉండటానికి తొడ ముందు, వెనక భాగం కండరాలు తోడ్పడుతుంటాయి. ఇవి బలహీనపడినా, వీటి అమరిక అస్తవ్యస్తమైనా చిప్ప అరగటానికి దారితీయొచ్చు. ప్రమాదాల్లో గాయాలతోనూ చిప్ప దెబ్బతిని, నొప్పి తలెత్తొచ్చు.
ఆడవారిలో ఎక్కువ!
మోకాలి చిప్ప నొప్పి పెద్దవారిలో కన్నా చిన్నవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పైగా మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువ. దీనికి కారణం లేకపోలేదు. మహిళల్లో కటిభాగం వెడల్పుగా ఉంటుంది. దీంతో తుంటి నుంచి వచ్చే ఎముక, మోకాలి మధ్య భాగం కలిసే చోట కోణం అస్తవ్యస్తమవుతుంది. దీంతో కూర్చోవటం, లేవటం వంటివి చేస్తున్నప్పుడు మోకాలి చిప్ప మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. మొదట్లో పెద్ద తేడా ఉండదు. అసలు దీన్ని గుర్తించలేరు కూడా. కానీ ఒత్తిడి మూలంగా చిప్ప లోపలి భాగం క్రమంగా నలుగుతూ వస్తుంటుంది. చివరికిది నొప్పికి దారితీస్తుంది. మహిళల్లో కండరాల బలం తక్కువగా ఉండటమూ ఒక కారణమే. ఆడవాళ్లు ఇంట్లో కూర్చోవటం, లేవటం, వంగటం వంటివీ ఎక్కువగా చేస్తుంటారు. కొన్నిసార్లు దుస్తుల మూలంగా మెట్లు ఎక్కటం, దిగటం వంటివి చేస్తున్నప్పుడు మోకాళ్లు కొద్దిగా పక్కలకు వంచుతుంటారు. దీంతో మోకీళ్ల అమరిక కోణం మారిపోతుంది. ఫలితంగా చిప్ప మీద ఒత్తిడి పెరిగి, త్వరగా అరిగే అవకాశముంది. కొందరు వేగంగా బరువు తగ్గాలని ఎక్కువెక్కువగా.. అదీ అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేస్తుంటారు. పైగా వీటిని సరైన పద్ధతిలో చేయకపోవచ్చు. ఇవీ తెలియకుండానే చిప్ప నొప్పికి దారితీయొచ్చు.
చికిత్స
మోకాళ్ల మీద అస్తవ్యస్తంగా పడే ఒత్తిడిని సరిదిద్దుకుంటే చాలావరకు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఏయే పనులు చేస్తున్నప్పుడు నొప్పి వస్తుందో గుర్తించి, వాటిని మానెయ్యటం ప్రధానం. అయితే అన్ని పనులను మానటం కుదరదు. ఇక్కడే మోకీళ్లకు దన్నుగా నిల్చే చికిత్సలు, నొప్పి మందులు ఉపయోగపడతాయి. వీటితో నొప్పి, వాపు తగ్గుతాయి. పనులు చేసుకోవటం తేలికవుతుంది.
కైనీజియో టేప్:చర్మానికి అతుక్కొని, చర్మం మాదిరిగా సాగే ఇది మోకాలి చిప్పకు దన్నుగా నిలుస్తుంది. ఆయా కోణాల్లో దీన్ని అతికిస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది. ఈ టేప్ అందుబాటులో లేకపోతే ప్రత్యేకమైన మోకాలి పట్టీలైనా వేసుకోవచ్చు.
ఐస్ ప్యాక్: మోకీళ్ల మీద ఐస్ ప్యాక్‌తోనూ వాపు, నొప్పి తగ్గుతాయి.
మందులు:నొప్పి తగ్గటానికి మందులు ఉపయోగపడతాయి. అయితే ఇవి సమస్యకు పరిష్కారం కాదు. నొప్పి తగ్గినా లోపల సమస్య అలాగే ఉంటుంది. అందువల్ల మందులతో నొప్పి తగ్గాక వ్యాయామాలు చేస్తే సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.
వ్యాయామాలు ప్రత్యేకం
తొడ ముందు, వెనక భాగం కండరాలు.. పిక్క, పిరుదు కండరాలన్నీ సమన్వయంతో పనిచేస్తూ మోకాళ్లకు దన్నుగా నిలుస్తుంటాయి. మోకాళ్ల మీద ఎక్కువ భారం పడకుండా చూస్తాయి. అందువల్ల వీటిని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. నిజానికి మోకాళ్ల నొప్పులు తలెత్తినప్పుడు సహజంగానే శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో కండరాల పటుత్వం మరింత తగ్గుతుంది. ఇది సమస్యను ఇంకాస్త జటిలం చేస్తుంది. వ్యాయామాలతో కండరాలు క్షీణించకుండా కాపాడుకోవచ్చు. వీటిని అంచెలంచెలుగా ఆయా వ్యక్తులకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. నొప్పి తగ్గించే వ్యాయామాలతో ఆరంభించి, క్రమంగా కండరాలను బలోపేతం చేసేవి మొదలెట్టాలి. నొప్పి పూర్తిగా తగ్గాక ఈ వ్యాయామాలు ఆపేయొచ్చు. కావాలనుకుంటే కొనసాగించొచ్చు.
నొప్పి తగ్గించే వ్యాయామాలు
ప్రత్యేకమైన పరికరాలేవీ లేకుండా, ఎవరికివారు చేసుకోదగిన తేలికైన వ్యాయామాలివి. నొప్పులు తగ్గటానికి తోడ్పడతాయి.
తొడ కండరం బిగుతు:దీన్నే ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ వ్యాయామం అంటారు. దీనికి ఐస్ ప్యాక్‌ను జోడిస్తే మరింత మంచి ఫలితముంటుంది. ఐస్‌ప్యాక్‌ను మోకాళ్లకు చుట్టి.. తొడ ముందు భాగం కండరాలను కొద్దిగా బిగపట్టటం ఇందులో కీలకాంశం. దీన్ని కూర్చొని గానీ పడుకొని గానీ చేయొచ్చు.
మడమలు లాక్కోవటం: పడుకొని లేదా నేల మీద కూర్చొని ఒక కాలి మడమను నెమ్మదిగా పిరుదుల వైపు లాక్కోవాలి. తర్వాత తిన్నగా కాలిని చాచాలి. మరో కాలుతో ఇలాగే చేయాలి. ఐస్‌ప్యాక్‌ను మోకాళ్లకు చుట్టుకొని చేస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.
షార్ట్ ఆర్క్: చిన్న బంతి లేదా తువ్వాలును చుట్టి మోకాళ్ల కింద పెట్టుకోవాలి. తర్వాత పాదాన్ని కొద్దిగా లేపుతూ, దించుతూ మోకాలి కింది భాగాన్ని పైకీ, కిందికీ కదిలించాలి. దీంతో తొడ ముందుభాగం కండరాలు బలోపేతమవుతాయి. చిప్ప అరగటం తగ్గుతుంది. రెండు మోకాళ్ల మధ్య బంతిని పెట్టుకొని నొక్కటమూ మేలు చేస్తుంది.
పాదంతో బంతిని నొక్కటం:గోడకు బంతిని ఆనించాలి. పడుకొని పాదంతో బంతిని వీలైనంత బలంగా నొక్కాలి. దీంతో మోకీళ్లలో పిస్టన్ ప్రేరేపితమై, వాపు తగ్గుతుంది. రక్త ప్రసరణ పుంజుకుంటుంది. నొప్పి తగ్గుముఖం పడుతుంది.