తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొవిడ్​ తర్వాత మహిళలకు కీళ్లనొప్పుల బెడద.. అదే కారణమా? - కొవిడ్ మహమ్మారి వల్ల మహిళలకు కీళ్ల నొప్పులు

కొవిడ్ మహమ్మారి తర్వాత మహిళల్లో కీళ్లవాతం (ఆర్థ్రయిటిస్‌) వంటి సమస్యలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. భారత్​లో సుమారు 15-20% మంది రుమటాయిడ్‌ కీళ్లవాతం సమస్యలతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు.

joint pains after covid
మహిళల్లో కీళ్ల నొప్పులు

By

Published : Nov 18, 2022, 7:14 AM IST

మన రోగనిరోధక శక్తి మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే కీళ్లవాతం (ఆర్థ్రయిటిస్‌) వంటి ఆటోఇమ్యూన్‌ సమస్యలు మహిళల్లో ఎక్కువ. కొవిడ్‌-19 మహమ్మారితో ఇవి మరింత పెరిగాయనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో సుమారు 15-20% మంది రుమటాయిడ్‌ కీళ్లవాతం సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. వీటి బారినపడ్డవారిలో కీళ్లు, కండరాలే కాదు.. అవయవాలూ ప్రభావితం అవుతుంటాయి. దీంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇవి మహిళల్లోనే ఎందుకు ఎక్కువ? కొంతవరకు దీనికి జన్యు స్వభావమే కారణం.

మగవారిలో ఎక్స్‌, వై క్రోమోజోములు.. మహిళల్లో రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. ఈ అదనపు ఎక్స్‌ క్రోమోజోమ్‌ రోగనిరోధకశక్తితో ముడిపడిన చాలా జన్యువుల మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందన అతిగా ప్రేరేపితమవుతుంది. ఎక్స్‌ క్రోమోజోమ్‌ నుంచి పుట్టుకొచ్చే చాలా జన్యువులు పెద్దఎత్తున జన్యు మార్పులకూ కారణమవుతుంటాయి. అంతేకాదు.. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరోన్‌ వంటి స్త్రీ హార్మోన్లు సైతం వ్యాధినిరోధక వ్యవస్థలో పాలు పంచుకుంటాయి. ఇవన్నీ మహిళలకు కీళ్లవాతం వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బుల ముప్పు పెరిగేలా చేస్తుంటాయి. అయితే అన్ని కీళ్లనొప్పులు రుమటాయిడ్‌కు సంబంధించినవి కావని గుర్తించాలి. వయసుతో పాటు కీళ్లు అరగటమూ (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) నొప్పులకు దారితీయొచ్చు.

పెద్ద వయసులో కీళ్ల నొప్పులు మొదలైతే చాలావరకు ఇదే కారణమై ఉండొచ్చు. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ చిన్న వయసులో.. 40 ఏళ్లలోపు తలెత్తుతుంది. ఇది పలు కీళ్లకూ విస్తరిస్తుంది. కీళ్లను దెబ్బతీసి, ఆకారం మారిపోయేలా కూడా చేస్తుంది. దీనికి దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే కొవిడ్‌-19కు ఆర్థ్రయిటిస్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు రుజువు కాలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావటంతో కండరాల కదలికలు తగ్గిపోయి వయసు మీద పడటం వల్ల ముంచుకొచ్చే కీళ్ల అరుగుదల లక్షణాలు ఎక్కువై ఉండొచ్చన్నది నిపుణుల భావన. ఏదేమైనా బరువును అదుపులో ఉంచుకోవటం, నడక, జాగింగ్‌, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటి వాటితో కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. ఒకవేళ సమస్య తలెత్తినా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details