మన అదృష్టమో, రోగనిరోధకశక్తి సామర్థ్యమో, యువతీ యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటమో, వైరస్ బలహీనతో.. కారణమేదైనా కొవిడ్-19 మనకు అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. వైరస్ సోకినా 80-90% మందిలో అసలు లక్షణాలే పొడసూపటం లేదు. లక్షణాలున్నవారిలోనూ 80-90% మందికి మామూలు స్థాయితోనే ఆగిపోతోంది. కేవలం 10-20% మందికే ఓ మాదిరిగా, తీవ్రంగా పరిణమిస్తోంది. అదీ 60 ఏళ్లు పైబడినవారికి, ఊబకాయులకు.. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ, గుండె, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు గలవారికి.. రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకుంటున్నవారికి, క్యాన్సర్ చికిత్సలు తీసుకుంటున్నవారికి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. వీరిలోనూ ఎంతోమంది ఇప్పుడు చికిత్సలతో కోలుకుంటుండటం గమనార్హం. కరోనా జబ్బు నియంత్రణ, చికిత్సలపై అవగాహన, అనుభవం పెరగటమే దీనికి మూలం. మొదట్లో ఊపిరితిత్తులనే దెబ్బతీస్తుందని భావించినప్పటికీ ఇది ఒళ్లంతా ప్రభావం చూపుతున్నట్టు అవగతమవుతోంది. వైరస్ ప్రేరేపించిన వాపు ప్రక్రియే (ఇన్‌ఫ్లమేషన్) తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది. రక్తం గడ్డకట్టే తీరు అస్తవ్యస్తమై సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటమే చాలావరకు ప్రాణాంతకమవుతోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ నిపుణులు చికిత్సలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఆరంభించిన మందులే అయినా చికిత్స క్రమంగా ఒక రూపానికి చేరుకుంటోంది. ప్రపరచ ఆరోగ్యసంస్థ, ప్రముఖ ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు, మన ఐసీఎంఆర్ సిఫారసులన్నింటినీ క్రోడీకరించుకుంటూ ఒక పద్ధతిని రూపొందించుకుంటున్నాం. దీన్ని అన్నిచోట్లా ఒకే రకంగా పాటించటం ఎంతైనా అవసరం. అందువల్ల ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి చికిత్స చేయాలనే దానిపై అవగాహన కలిగుండటం అత్యవసరం.
లక్షణాలు లేనివారికి..
వైరస్ పాజిటివ్‌గా తేలి, లక్షణాలేవీ లేనివారు ఇతరులతో కలవకుండా ఇంట్లో విడిగా ఒక గదిలో ఉంటే చాలు. తమ వస్తువులను వేరేవాళ్లు తాకకుండా చూసుకోవాలి. పళ్లెం, పాత్రల వంటి వాటిని తామే శుభ్రం చేసుకుంటే మంచిది. ఆరోగ్య కార్యకర్తల సలహాలు, సూచనలు పాటిస్తూ గదిలో 10 రోజుల పాటు విడిగా గడపాలి. ఆ తర్వాత వారం వరకు ఇంటికే పరిమితం కావాలి. లక్షణాలు లేనంతవరకు ప్రత్యేకించి మందులేవీ అవసరం లేదు. అయితే జింక్, విటమిన్ సి, విటమిన్ డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లోపించినవారికి సమస్య ఉద్ధృతమయ్యే అవకాశముంది.
ఒక మాదిరి జబ్బు గలవారికి
వీరికి గంటకోసారి ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించటం కీలకం. ఆక్సిజన్ తగ్గుతుంటే ముందు చిన్న గొట్టం ద్వారా ముక్కులోకి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలకపోతే మాస్కు బిగించి ఆక్సిజన్ ఇవ్వాలి. అవసరమైతే మెలకువగా ఉన్నప్పుడు బోర్లా పడుకోబెట్టటం మంచిది. కాసేపు ఎడమ వైపునకు, కాసేపు కుడి వైపునకు తిప్ఫి. కాసేపు బోర్లా పడుకోబెట్టాలి. దీంతో ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది.
కరోనా జబ్బు ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఉద్ధృతం కావొచ్ఛు ఉన్నట్టుండి న్యుమోనియాకు దారితీయొచ్ఛు ఇలాంటి స్థితిలో జ్వరం, దగ్గు ఎక్కువవుతాయి. శ్వాస వేగం నిమిషానికి 24, అంతకన్నా ఎక్కువకు పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ 94-90% మధ్యకు పడిపోతుంది. ఇలాంటివారిని ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయటం తప్పనిసరి. దీంతో చాలామంది కోలుకుంటారు. తీవ్రదశలోకి చేరుకునే ముప్పు తగ్గుతుంది.
- జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. దగ్గు తగ్గటానికి ఎన్-ఎసిటైల్ సిస్టీన్ మాత్రలు (రోజుకు 3) ఇవ్వచ్ఛు ఈ దగ్గు మాత్రలను సగం కప్పు నీటిలో కలిపి తాగిస్తే మంచిది. దీంతో తెమడ తేలికగా బయటకు వచ్చేస్తుంది. వీటితో పాటు జింక్, విటమిన్ సి, విటమిన్ డి మాత్రలు కొనసాగించాలి.
- ద్రవాలు తగినంతగా తీసుకునేలా చూడాలి.
- రక్తం గడ్డలు ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా లో మాలిక్యులార్ హెపారిన్ లేదా సంప్రదాయ హెపారిన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీవ్ర కిడ్నీ జబ్బు గలవారికి, బాగా రక్తస్రావం అవుతున్నవారికి దీన్ని ఇవ్వకూడదు.
- వాపు ప్రక్రియ తగ్గటానికి డెక్సామెథసోన్ లేదా మిథైల్ ప్రెడ్నిసోలన్ మందులను 3-5 రోజుల పాటు ఇవ్వటం మంచిది. కొందరికి ఇంకా ఎక్కువ రోజులు ఇవ్వాల్సి రావొచ్ఛు
- ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు రెమ్‌డెసివిర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందుబాటులో లేకపోతే హైడ్రాక్సీక్లోరోక్విన్ తొలిరోజున 400 మి.గ్రా., మర్నాటి నుంచి 200 మి.గ్రా. చొప్పున నాలుగు రోజుల పాటు ఇవ్వాలి.
- కొందరికి ప్లాస్మా చికిత్స అవసరమవ్వచ్ఛు ఇది ఈ దశలోనే బాగా పనిచేస్తుంది. సాధారణంగా ప్లాస్మాను 200 మి.లీ. మోతాదులో ఇస్తారు. అవసరమైతే 24 గంటల తర్వాత మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది.
- మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలుంటే తగు మందులతో నియంత్రణలోకి తీసుకురావాలి.
స్వల్ప లక్షణాలు గలవారికి