తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

డిప్రెషన్​ మందు లేని రోగం కాదు... కుంగుబాటును జయిద్దాం రండి...! - ఒంటరి సమస్యలు

డిప్రెషన్​, స్ట్రెస్​, కుంగుబాటు, మానసిక ఒత్తిడి పదాలు ఏవైనా పరమార్థం మాత్రం ఒకటే... అదే మనోవేదన. ఇది మనిషిని ఎంతలా వేధిస్తుందంటే... ప్రపంచమంతా పక్కనే ఉన్నా... నీతో కూడా నువ్వు మనసు విప్పి మాట్లాడుకోలేనంతగా. నీకంటూ ఎవరూ లేరని, నువ్వు కూడా నీకు సొంతం కాదని పదే పదే గుర్తు చేస్తూ నరకయాతనను చూపిస్తుంది. నీ చుట్టూ వందల మంది ఉన్నా... వారితో సంబంధం లేకుండా నిన్ను ఒంటరిగానే ఉంచుతుంది. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది... దీని నుంచి ఎలా బయటపడాలి? తెలుసుకుందాం రండి.

how to change your attitude about over depression
డిప్రెషన్​ మందు లేని రోగం కాదు... మానసిక ఒత్తిడిని జయిద్దాం రండి...!

By

Published : Jun 18, 2020, 8:32 PM IST

Updated : Jun 18, 2020, 10:58 PM IST

  • మనోవ్యథే కాదు..!

కుంగుబాటు వల్ల కేవలం మానసిక వ్యథ మాత్రమే కాదు.. శారీరక బాధలు, వ్యాధుల ముప్పూ పెరుగుతోంది. మానసిక ఒత్తిడి కారణంగా మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి సమస్యలూ పెరుగుతున్నాయి. మరోవైపు ఆయా వ్యాధుల కారణంగా కూడా డిప్రెషన్‌ ముంచుకొస్తోందని వైద్యరంగం గుర్తించింది.

  • తోడ్పాటు అవసరం

ఇంట్లో వారు, సన్నిహితులు కుంగుబాటు బాధితులను కోలుకునేందుకు తోడ్పాటునివ్వాలి. వారి మాటలును, బాధలు... సానుకూలంగా ఆలకించి... సమస్యను అర్థం చేసుకోవాలి. వాకు నిరాశ నుంచి బయటపడేలా ప్రోత్సహించాలి. తరచుగా వారితో మాట్లాడుతూ ఉండాలి. వాళ్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. వారి భావాలను, అభిప్రాయాలను కొట్టేయకుండా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలను గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

  • ఏప్రిల్​ 7 ప్రపంచ ఆరోగ్య దినం

ప్రపంచం కుంగిపోతోంది!... మనో ప్రపంచం కకావికలమైపోతోంది!!... మనం అంగీకరించకపోయినా ఇది వాస్తవమే!!!

ఎటుచూసినా ‘కుంగుబాటు’ ఆవరించి.. జీవితాల్లోని ఆనంద మకరందం హరించికుపోతోంది. దీంతో హాయిగా.. ఆహ్లాదంగా గడిచిపోవాల్సిన నేటి జీవితాలు.. ఎన్నడూ లేనంత దుర్భరంగా తయారవుతూ... భారంగా.. కడు దీనంగా గడుస్తున్నాయి. గత కొన్ని దశబ్దాలుగా విపరీతంగా పెరిగిపోతున్న సమస్య ఇది! 1990లతో పోలిస్తే 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా ‘డిప్రెషన్‌’ బాధితుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం 15-29 ఏళ్ల మధ్య వయసులో తనువు చాలిస్తున్న వారిలో రెండో అతి ముఖ్య మరణ కారణం డిప్రెషనే కావటం మరింత ఆందోళనకరం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏటి ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా ‘కుంగుబాటు’పై ప్రత్యేక దృష్టి పెట్టి.. దీనిపై విస్తృత చైతన్యం తీసుకురావాలని నిర్ణయించింది. కుంగుబాటు మందులేని మనోవ్యాధి ఏం కాదు. దాచుకోవాల్సిన సమస్య అంతకంటే కాదు. దీని గురించి ఎంత మనసు విప్పి మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే.. అంత త్వరగా బయటపడొచ్చు. అందుకే కుంగుబాటు గురించి.. మాట్లాడుకుందాం.. రండి!!

  • శారీరక లక్షణాలు..

* తీవ్రమైన నిస్సత్తువ, ఏ పనికీ శక్తిలేకపోవటం, నిద్ర పట్టకపోవటం లేదా అతినిద్ర, ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, తల లేదా ఒళ్లు నొప్పులు, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటి బాధలు

  • భావోద్వేగ లక్షణాలు

* నిరంతరం బాధ, ఆందోళన, ఎప్పుడూ నిరాశలో కూరుకుపోవటం, జీవితం నిస్సారం అనిపించటం, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపకశక్తి తగ్గటం, చికాకు, కుదురుగా ఉండకపోవటం, గతంలో ఆనందాన్ని కలిగించిన విషయాలే.. ఇప్పుడు నిరాసక్తంగా అనిపించటం, నలుగురిలో కలవలేకపోవటం.

  • మానసిక లక్షణాలు

* నేనెందుకూ పనికి రాను అనిపించటం, నాకేదీ మంచి జరగదని నిరాశపడటం, జీవితం ఏమీ బాగోలేదనిపించటం, భవిష్యత్తు అంధకారంలా అనిపించటం, ఎప్పుడూ ఏదో తప్పు చేశానని అనిపిస్తుండటం, ఆత్యహత్య ఆలోచనలు పెరగటం.

* వీటిల్లో కొన్ని లక్షణాలైనా 2 వారాలకు మించి వేధిస్తుంటే వైద్యులు దీన్ని ‘మానసిక కుంగుబాటుగా పరిగణిస్తారు. అయితే వీటన్నింటి కన్నా ముఖ్య లక్షణం చేసే పని మీద, అలవాట్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పైన ఆసక్తి తగ్గిపోవటం.

  • కుంగుబాటుకు చికిత్స ఉంది!

సాధారణంగా కొందరిలో కుంగుబాటు 3-6 నెలల్లో దానంతటదే తగ్గుతుంది. అలాగని చికిత్స అక్కర్లేదని భావించటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సమయంలో వీరు అనుభవించే బాధ వర్ణనాతీతం. కొన్నిసార్లు ఇది ఆత్మహత్యా భావనలకూ దారి తియ్యొచ్చు. రెండోది... చికిత్స తీసుకోకపోతే మళ్లీమళ్లీ డిప్రెషన్‌ బారినపడొచ్చు. సమస్య దీర్ఘకాలికంగా మారే అవకాశాలూ పెరుగుతాయి. కుంగుబాటుకు ఇప్పుడు మంచి చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.

* యాంటీ డిప్రెసెంట్లు: ఇవి ప్రధానంగా మన మెదడులోని సెరటోనిన్‌, నోర్‌పినెఫ్రైన్‌, డోపమైన్‌ అనే రసాయనాల మీద పని చేసి, కుంగుబాటును తగ్గిస్తాయి.

* సైకోథెరపీ: ఇందులో కౌన్సెలింగ్‌ ద్వారా ఆలోచనా విధానాన్ని.. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనల నుంచి మనసు మళ్లేలా చేయటానికి ప్రయత్నిస్తారు.

  • చికిత్సే సరైన మార్గం!

చాలామంది కుంగుబాటును- ఆత్మవిశ్వాసం లోపించటంగానో, వ్యక్తిత్వ లోపంగానో... లేకపోతే భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి సంబంధించిన సమస్యగానో భావిస్తున్నారు. అందుకే కుంగుబాటు విషయంలో తరచూ వ్యక్తిత్వ నిర్మాణం, వికాసం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన వంటివాటి గురించి మాట్లాడుతుంటారు. కానీ కుంగుబాటును ఒక వ్యాధిగా గుర్తించటం చాలా ముఖ్యం. మెదడులో వచ్చే మార్పులే దీనికి మూలం. కాబట్టి దీనికి చికిత్స తీసుకోవటమే సరైన మార్గం. అది తప్పనిసరి కూడా.

  • సర్దుకుపోవటమూ సమస్యే..!

సమాజంలో చాలామంది డిప్రెషన్‌ లక్షణాలను తేలికగా తీసుకుంటూ.. సర్దుకుపోతూ.. చివరికి తీవ్రమైన స్థితిలోకి జారిపోతున్నారు. బయటకు చెప్పుకుంటే ఏమనుకుంటారోనన్న అపోహల్లో కూరుకుపోతూ.. చాలామంది దీని గురించి ఎవరికీ చెప్పుకోకుండా లోలోపలే కుంగిపోతున్నారు.

  • నిందలతో ప్రయోజనం లేదు

కుంగుబాటు బాధితులకు చిన్న చిన్న బాధలు, కష్టాలు సైతం పెద్ద భూతంలా కనిపిస్తుంటాయి. వీటిని భరించటం ఇక తమ వల్ల కాదనీ అనిపిస్తుంటుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో జీవించటం వృథా అనే భావన కూడా నిరంతరం వెంటాతుంటుంది. ఆత్మహత్య చేసుకోవటం తప్ప... సమస్యలకు వేరే పరిష్కారమే లేదనే నిర్ణయానికీ వచ్చేస్తుంటారు. ఇలాంటివి ఎవరికైనా ఎదరవ్వొచ్చని అర్థం చేసుకోవటం, నిజానిజాలను విడమరచుకోవటం మంచిది. ఇలాంటి ఆలోచనల నుంచి విముక్తి పొందే మార్గముందని, ఇందుకోసం సైక్రియాట్రిస్టుల వంటివారు తోడ్పడతారని తెలుసుకోవటం చాలా కీలకం.

  • మహిళల్లో ఎక్కువ

కుంగుబాటు ముప్పు పురుషుల కన్నా స్త్రీలకు 70% అధికం. ముఖ్యంగా కాన్పు తర్వాత కుంగుబాటు (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే నెలసరి సమయంలో, ముట్లుడిగిపోయే దశలో అడుగుపెట్టే వారిలో కూడా కొందరికి డిప్రెషన్‌ ముప్పు పెరుగుతుంది. స్త్రీలలో కుంగుబాటు లక్షణాలు సైతం- మగవారిలో కన్నా భిన్నంగా ఉంటాయి. మగవారిలో తీవ్ర అలసట, చిరాకు, గతంలో ఆనందం కలిగించిన అంశాలపై ఆసక్తి తగ్గటం, నిద్ర పట్టకపోవటం వంటివి కనిపిస్తాయి. అదే స్త్రీలలోనైతే విచారం, జీవితం నిస్సారంగా, విలువలేనిదిగా అనిపించటం.. తరచూ తమను తాము నిందించుకోవటం వంటివి ఉంటాయి. పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌కు చికిత్స తీసుకోకపోతే నెలలు, ఏళ్ల కొద్దీ వేధిస్తుంది. ఇది తల్లి ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు. బిడ్డ ఎదుగుదలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.

  • ఏం చేయాలి?

* కాన్పు అనంతరం డిప్రెషన్‌ లక్షణాలు కనబడితే తమ ఆలోచనల గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించటం.. వారితో ఎక్కువ సమయం గడపటం మంచిది.

* ఎప్పుడూ ఇంటికే అంటుకుపోకుండా వీలైనప్పుడల్లా బయటకు వెళ్తుండాలి. సురక్షితమైన ప్రదేశాలైతే బిడ్డను కూడా వెంట తీసుకెళ్లొచ్చు. ఇది తల్లీ బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది.

  • పిల్లలనూ వదలదు

కుంగుబాటు అనగానే చాలావరకూ ఇది పెద్దవారికి సంబంధించిన సమస్యగానే భావిస్తుంటారు. కానీ ఇది పిల్లలనూ వేధిస్తుంది! ఇది విద్యార్థుల్లోనూ గణనీయంగానే ఉంటున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కుంగుబాటు లక్షణాలు గల 13-19 ఏళ్ల పిల్లల్లో 45% మంది... మద్యం, మాదక ద్రవ్యాలకూ అలవాటు పడుతుండటం.. పాఠశాలల్లో వేధింపులతో 75% మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు తేలటం గమనార్హం. తరగతిలో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు పడతారు. ఇలాంటి వాటిని గమనిస్తే తాత్సారం చేయొద్దు.

  • ఏం చేయాలి?

* పిల్లల్లో కుంగుబాటు లక్షణాలు కనబడితే తల్లిదండ్రులు వారితో మాట్లాడి దేనికోసం బాధపడుతున్నారో గుర్తించగలగాలి. పిల్లలపై విపరీతమైన ఒత్తిడికి పడకుండా చూసుకోవాలి. హింస, వేధింపుల వంటి వాటికి గురికాకుండా జాగ్రత్త పడాలి. కొత్త బడిలో చేరటం, యవ్వనదశలోకి అడుగుపెట్టటం వంటి సందర్భాల్లో పిల్లలపై మరింత ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

  • వృద్ధుల్లో తరచుగా

పదవీ విరమణ పొందటం, శరీరం సహకరించకపోవటం వల్ల ఇంట్లోంచి అంతగా బయటకు వెళ్లలేకపోవటం, జీవిత భాగస్వామి దూరం కావటం వంటివన్నీ వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో కొందరు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి... కుంగుబాటుకు లోనవుతుంటారు. వీరిలో ఆత్యహత్య ఆలోచనలూ ఎక్కువే. కాబట్టే వృద్ధుల్లో కుంగుబాటు లక్షణాలను విస్మరించటానికి వీల్లేదు.

  • ఏం చేయాలి?

* కుటుంబసభ్యులతో, మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి. సంగీతం వినటం, చదరంగం ఆడటం వంటి మునుపటి అలవాట్లను కొనసాగించాలి. ఇంతకుముందు చేసిన పనులను ఇప్పుడు చేయటం కుదరకపోతే వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి.

  • యువతకు శాపం

యవ్వన దశలోకి అడుగుపెట్టే సమయంలో ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు... మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవటం, కొత్త ప్రాంతాలకు వెళ్లటం, జీవితంలో స్థిరపడే మార్గాన్ని ఎంచుకోవటం.. ఇలాంటివన్నీ సవాళ్లుగానే కనిపిస్తాయి. తమను తాము గాయపరచుకోవటం, ఆత్మహత్య ఆలోచనలు... యువతీ యువకుల్లో ఎక్కువగానే ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. తాము దేనికీ పనికిరామని భావిస్తుండటం, తమను తాము నిందించుకోవటం వంటి కుంగుబాటు లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయటం తగదు.

  • ఏం చేయాలి?

* తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆలోచనల గురించి సన్నిహితులతో, మిత్రులతో చెప్పుకోవాలి. దీంతో మనసు తేలికపడుతుంది. ఇంటికి దూరంగా ఉండేవారు వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులను కలుసుకోవటానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయటం, పడుకోవటం విధిగా పాటించాలి. మద్యం, పొగ అలవాట్ల జోలికి వెళ్లకపోవటం మంచిది. తమను తాము విమర్శించుకోవటం, నిందించుకోవటం మాని... సానుకూల దృష్టితో సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను వెతకాలి.

ఇదీ చూడండి :సుఖీభవ: పెరటి వైద్యం.. ఆరోగ్యానికి ఎంతో లాభం

Last Updated : Jun 18, 2020, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details