Heart Attack During Sex: మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో అజయ్ పార్తేకి(28) అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ప్రేయసిలో శృంగారంలో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయాడు. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అతడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని గుర్తించారు. ఈ వార్త.. అనేక మందిలో అనుమానాలకు దారితీసింది. శృంగారానికి, గుండె పోటుకు సంబంధం ఉంటుందా? సెక్స్.. గుండెకు ప్రమాదకరమా? వంటి ప్రశ్నలకు తావిచ్చింది. దిల్లీ రిజెన్సీ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా చేస్తున్న డాక్టర్ అభినిత్ గుప్తా.. ఈ సందేహాల నివృతికి ప్రయత్నం చేశారు.
ప్రశ్న: సెక్స్ వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందా?
జవాబు: శృంగారం ఓ సహజ ప్రక్రియ, ఒక రకమైన వ్యాయామం. ఆరోగ్యకరమైన గుండె ఉన్నవారెవరికీ సెక్స్ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం లేదు.
ప్రశ్న: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లకు సెక్స్ ప్రమాదకరమా?
జవాబు: సెక్స్ చేసే సమయంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కానీ.. ఆరోగ్యకరమైన గుండె ఉన్నవాళ్లెవరూ కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మెట్లు ఎక్కగలుగుతుంటే, ఒక మైలు దూరం జాగింగ్ లేదా వాకింగ్ చేయగలుగుతుంటే.. సెక్స్‌లో పాల్గొనడంలో ఎలాంటి ప్రమాదం లేదు. శృంగారం వల్ల రిస్క్ కన్నా.. సెక్స్ సహా ఇతర వ్యాయామాలతో వచ్చే లాభాలే ఎక్కువ.
అయితే.. గుండె సంబంధిత సమస్యలు ఉండి, ఔషధాలు వాడేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంగస్తంభన లోపం వంటి సమస్యలకు మందులు వాడే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది. గుండె, శృంగార సమస్యలకు సంబంధించిన ఔషధాలను కలిపి తీసుకుంటే రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయే ప్రమాదముంది.