తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వెయిట్ లాస్.. షుగర్​ కంట్రోల్.. ఘాటెక్కించే 'మిర్చి'తో లాభాలెన్నో..

సాధారణంగా చాలా మంది మిరపకాయ అంటే భయపడిపోతారు. కారంగా, ఘాటుగా ఉంటుంది.. అంటూ దాన్ని తీసి పక్కన పడేస్తుంటారు. అయితే ఈ మిరపకాయలు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. అందుకే వీటిని రోజువారీ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రకరకాల ఆరోగ్య సమస్యలను మనం నుంచి దూరం చేసే మిర్చి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

health benefits of green chilli
health benefits of green chilli

By

Published : Mar 26, 2023, 3:38 PM IST

మిరపకాయ అనగానే నషాళానికి అంటే కారపు ఘాటే గుర్తొస్తుంది.. కానీ కారం లేకుండా మనకు వంటకం తినలేము. పచ్చిమిర్చి, పండు మిర్చి, ఎండు మిర్చిలను మనం రోజువారీ వంటకాల్లో వాడతాం. పూర్వం మనవారు కారం కోసం మిరియాలనే వాడేవారు. పోర్చుగీసు వారు భారత దేశానికి మిరపను పరిచయం చేశారు. ఆ తర్వాత కాలంలో ఇది మన ఆహారంలో భాగమైంది. అయితే, ప్రస్తుతం మిరపకాయల్ని పండించటంలోనూ, ఉపయోగించటంలోనూ మన దేశమే మొదటి స్థానంలో ఉంది.

మిరప క్యాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాసే కాయ. మిరప చెట్లలో అనేక రకాలున్నాయి. ఆకృతి, రంగు, రుచిలో తీక్షణతను బట్టి.. మిరప కాయలు, మిరప పండ్లు లభిస్తాయి. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థ తీవ్రతను బట్టి దాని ఘాటు ఆధారపడి ఉంటుంది. ఈ ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే క్లోమము వుంటుంది. దీని వల్లే మనం వంటల్లో కారం వాడినా అవి చక్కగా జీర్ణమవుతాయి.

మిరప పండ్లను తాజాగానూ, ఎండిన రూపంలోనూ ఉపయోగిస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వీలుగా మిరపకాయలు ఎండబెట్టి కారం చేసి పొడి రూపంలో నిల్వ చేస్తారు. కారం ఘాటుకు కళ్లలోనూ, ముక్కులోనూ నీళ్లు తెప్పించే మిరప కాయల్లో, కారంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ కాయల్ని వంటల్లో వాడటమే కాకుండా మిరపకాయ బజ్జీలు లాంటివి చేసుకొని తినడానికి చాలా ఇష్టపడతారు. అలానే తాజా మిరప పండ్లను పచ్చళ్లుగా చేసుకుని నిల్వ చేస్తారు. మిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండిన తర్వాత నూనెలో వేయించుకుని తినని వారుండరేమో! కొందరు పెరుగు అన్నంతో పచ్చి మిరపకాయలు నంజుకుని తింటారు. ఎండు మిరపకాయలైనా, పచ్చిమిర్చి అయినా వాటి ప్రయోజనాలతో ఆయుష్షు కూడా పెరుగుతుందంటారు ఆరోగ్య నిపుణులు. మరి మిరపకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..!

  • మిరపలో ఉండే ఎ, సి విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • శరీరంలో పేరుకుపోయిన విషతత్వాలను తొలగిస్తుంది.
  • పెద్దపేగుల్లో ఉండే హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది.
  • రక్త శోధకంగా పని చేస్తుంది.
  • పచ్చిమిర్చిలో క్యాన్సర్​ను నిరోధించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
  • రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాల పని తీరును మెరుగుపరచడానికి పచ్చిమిర్చి సహాయం చేస్తుంది.
  • మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంచడానికి మిర్చి సహాయపడుతుంది.
  • స్థూలకాయం ఉన్నవారికి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
  • సైనస్‌ సమస్యల నుంచి మిర్చి మనల్ని కాపాడుతుంది.
  • పచ్చిమిర్చిలో ఉండే ప్రొస్టేట్​లో క్యాన్సర్‌ను తగ్గించే గుణాలున్నాయి.

శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకూ, ప్రొటీన్లకూ పెట్టింది పేరు పచ్చిమిర్చి. వీటిలో పుష్కలంగా ఉండే ఎ విటమిన్ మెరుగైన కంటి చూపునిస్తే ఎముకలూ, పళ్ల బలానికి కూడా సాయపడుతుంది సి విటమిన్​. రక్తహీనత బారిన పడుకుండా కాపాడే ఐరన్​, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం వంటి పోషకాలు మిర్చిలో వుంటాయి. రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాకు పచ్చిమిర్చి ఔషధంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేదా కారం తప్పనిసరిగా మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. రోజూ కనీసం ఒక్క పచ్చి మిరపకాయ అయినా తింటే చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆహార పరిరక్షణకు, ఆత్మరక్షణకు వాడే మిరపకాయలతో వున్న లాభాలెన్నో చూశారుగా! ఘాటుగా ఉన్నా సరే లాగించేయండి మరి.

ABOUT THE AUTHOR

...view details