'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నట్లు మన శరీరంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యముంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది తమ కంటి సంరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమందికి కళ్ల కింద నల్లటి వలయాల్లాంటి మచ్చలు ఉంటే, మరికొంతమందికి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడడం, పదే పదే కాఫీ-టీలు తాగడం, అధిక ఒత్తిడి, ఆందోళనకు గురికావడం, పోషకాహార లోపం... ఇవన్నీ కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉబ్బిన కళ్లు అమ్మాయిలను అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి, ఇలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలేంటో ఓసారి తెలుసుకుందాం. కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి కింద చర్మం ఉబ్బకుండా ఉండేందుకు ఇంట్లోనే హోమ్ రెమిడీస్ తయారు చేసుకోవచ్చు.
దోసకాయ ముక్కలు..
దోసకాయ ముక్కలు సన్నగా కోయాలి. వాటిని 10-12 నిమిషాలపాటు కళ్లపై ఉంచాలి. కళ్ల మీద డార్క్ సర్కిల్స్, వలయాల మీద సున్నితంగా రుద్దాలి. దోసకాయ ముక్కల్ని అలాసే కాసేపు ఉంచి రిలాక్స్ అవ్వండి. అలాగే బంగాళదుంప ముక్కలను కూడా ఇదే విధంగా చేయవచ్చు. కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బాదం నూనె..
బాదం నూనె కూడా కళ్లకు ఉపశమనాన్ని ఇస్తుంది. దూది మీద బాదం నూనెను వేసి కంటి డార్క్ సర్కిల్స్ వద్ద మర్దన చేయండి. ఇలా చేసేటప్పుడు కంటిలో బాదం నూనె పడితే కళ్లు మండుతాయి. కాస్త జాగ్రత్త వహించండి. మరుసటి రోజు ఉదయాన్నే నీళ్లతో కడుక్కోండి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.