అలవాటు పడతారు..
వయసుకు అనుగుణంగా చిన్నారులు నిద్రపోయే సమయం మారుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన పసి పిల్లల దగ్గర్నుంచి వారికి ఆరువారాల వయసొచ్చే వరకూ చిన్నారులు తరచూ నిద్ర లేస్తుంటారు. తరచూ ఫీడింగ్ అవసరం ఉండటం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే నాలుగు నెలలు గడిచేసరికి చిన్నారులకు రాత్రి వేళల్లో విరామం లేకుండా ఆరుగంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం అలవాటవుతుంది. ఇలా కాకుండా వారు తరచూ మేల్కొంటున్నారంటే వారికందించే ఆహారం దగ్గర్నుంచి వారు నిద్రపోవడం వరకు ఉన్న ప్రణాళిక ఓ క్రమపద్ధతిలో లేదని అర్థం. కాబట్టి ప్రతి పనినీ నిర్ణీతమైన సమయంలో చేయడం ద్వారా చిన్నారులు కొన్ని రోజుల్లోనే దానికి తగ్గట్టుగా అలవాటు పడిపోతారు. దీనికోసం వారికి ఏ సమయానికి ఏ ఆహారం అందించాలి? ఎప్పుడు నిద్రపుచ్చాలో నిర్ణయించుకొని ఓ టైం టేబుల్ సిద్ధం చేయాలి. దాని ప్రకారం వ్యవహరిస్తే చిన్నారులు రాత్రి పూట ఎక్కువ సమయం నిద్రపోవడానికి అలవాటు పడతారు. ఇలా టైం టేబుల్ సిద్ధం చేసే విషయంలో అవసరమైతే పిల్లల వైద్య నిపుణుల సాయం తీసుకోవడం మంచిది.
వరుస క్రమం పాటించాలి..
చాలామంది తల్లులు కడుపు నిండితే త్వరగా నిద్రపోతారనే ఉద్దేశంతో పాపాయికి పాలు పడుతుంటారు. ఇలా చేయడం వల్ల వారు దానికే అలవాటు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్నారులకు తనకు తానుగా నిద్రపోయేలా అలవాటు చేయాలి. ఆరువారాల వయసు వచ్చేసరికి చిన్నారుల్లో 'స్లీప్ - వేక్ సైకిల్' మొదలవుతుంది. అందువల్ల వారికి నిర్ణీత వేళల్లో నిద్రపోవడం, లేవడం అలవాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని పద్ధతులు పాటించాలి. ముందుగా పాపాయికి స్నానం చేయించి పాలు పట్టాలి. కొన్ని సందర్భాల్లో పాపాయి నిద్ర పోతున్నట్లుగా అనిపించినా వెంటనే మేల్కొంటుంది. దీనికి మనం చేసే శబ్దాలు కూడా కారణం కావచ్చు. అందుకే తనను నిద్రపుచ్చాల్సిన సమయానికి అరగంట ముందే వీలైనంత నిశ్శబ్దమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత జోలపాట పాడటం లేదా కథ చెప్పడం లాంటివి చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ గొంతు గట్టిగా కాకుండా నెమ్మదిగా ఉండాలి. దీనివల్ల చిన్నారులు మెల్లగా నిద్రలోకి జారుకొంటారు. రోజూ ఒకే సమయానికి వీటిన్నింటినీ చేయడం ద్వారా క్రమంగా వారు ఈ పద్ధతికి అలవాటు పడతారు. అలాగే పగటి వేళల్లో పిల్లలు వీలైనంత తక్కువగా నిద్రపోయేలా చూడటం కూడా అవసరమే. అప్పుడే వారు రాత్రి ఎక్కువ సమయం పడుకోగలుగుతారు.