వినికిడి లోపానికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. అయితే దీనికి కారణమేంటన్నది సమస్య మొదలయ్యాక గానీ బయటపడదు. వినికిడి లోపం తలెత్తినప్పుడు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే మతిమరుపు, కుంగుబాటు, కింద పడిపోవటం వంటి తీవ్ర సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదముంది. అందువల్ల సమస్యను తేలికగా తీసుకోవటం తగదు.
ఎదుటివారిని బిగ్గరగా మాట్లాడాలని తరచూ అడుగుతుండటం, టీవీ సౌండ్ బాగా పెంచటం, రణగొణధ్వనుల మధ్య ఆయా వ్యక్తుల గొంతులను సరిగా పోల్చుకోలేకపోవటం వంటివన్నీ వినికిడి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరముందని సూచించే సంకేతాలే. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే విధిగా డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకోవాలి. ఒక్క చెవిలోనే వినికిడి తగ్గినట్టు గుర్తిస్తే మాత్రం అసలే తాత్సారం చేయరాదు. వినికిడి తగ్గినా అందరికీ సాధనాలు అవసరం ఉండకపోవచ్చు. డాక్టర్లు పరీక్ష చేసి, ఎలాంటి రకం లోపమనేది గుర్తిస్తారు. దీని ఆధారంగా వినికిడి పరికరాల అవసరముందో, లేదో నిర్ణయిస్తారు. వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే సమస్య మరింత ముదరకుండా, ఇబ్బందుల బారినపడకుండా చూసుకోవచ్చు.
ఉపాయాలు లేకపోలేదు
వినికిడి సాధనాలను అంగీకరించకపోవటానికి బహుశా మనసే కారణం కావొచ్చు. ఇతరుల కన్నా భిన్నంగా కనిపించటానికి ఎవరూ ఇష్టపడరు కదా. అయితే రోజువారీ జీవితంలో వీటిని భాగస్వామ్యం చేసుకోగలిగితే పెద్ద మార్పే కనిపిస్తుంది. ఇందుకు కొన్ని ఉపాయాలు తోడ్పడతాయి.
ముందుగా ఇంట్లో: వినికిడి పరికరాలను ధరించి బయటకు వెళ్లటానికి ముందు ఇంట్లోనే ప్రయత్నించటం మంచిది. తెలిసిన వారి మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో ధరిస్తే బెరుకు తగ్గుతుంది. ఎదుటివారితో తగినంత బిగ్గరగా మాట్లాడటం, కొత్త సామర్థ్యాలకు తగినట్టుగా టీవీ శబ్దం సరిచేసుకోవటం వంటివి అలవడతాయి.