ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండగలం అని అర్థం. అయితే పండ్లను తినే అలవాటు ఉన్న వారిలో కొంతమంది చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యం బారినపడుతున్నారు. అసలు పండ్లు తీసుకోవడంలో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా..!
పండ్లను నేరుగా తినడం అనేది అన్నింటి కంటే ఉత్తమమైన మార్గంగా వైద్యులు చెబుతారు. యాపిల్, అరటిపండు లాంటివి నేరుగా తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. కానీ చాలామంది ఇలా నేరుగా తినడానికి ఇష్టపడకపోవచ్చు. దీంతో రకరకాల జ్యూస్‌లు లేదంటే వేరే వాటితో కలిపి తినవచ్చు. సలాడ్లు, చాట్లు, షేక్‌లు అంటూ వివిధ పేర్లుతో, రకరకాల కాంబినేషన్‌ల్లో పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా పండ్లతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల.. శరీరానికి తీవ్రం నష్టం కలుగుతుంది. ఏ పండ్లను ఎలాంటి ఆహారాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యారెట్, ఆరెంజ్ కలిపి తీసుకోవడం:
మన ఆరోగ్యాన్ని కాపాడటానికి క్యారెట్, ఆరెంజ్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిని కలిపి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిని కలిపి తినకూడదు. అలాగే చాలామంది క్యారెట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్‌ను కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ కాంబినేషన్‌ను తీసుకుంటే గుండెల్లో మంట పుట్టడం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బొప్పాయి, నిమ్మకాయ:
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలామందికి తినే ఆహారంలో నిమ్మకాయను పిండుకొని తినే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది బొప్పాయి మీద నిమ్మకాయ పిండుకొని తినే అలవాటు కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతుంది.