నడక తేలికైన వ్యాయామం. ఎవరైనా, ఎక్కడైనా చేయొచ్చు. అందుకే రోజుకు 10వేల అడుగులు నడిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదేం లెక్క? ఇందులోని మతలబేంటని ఎప్పుడైనా ఆలోచించారా? మనకు తేలికగా గుర్తుండటం కోసం సూచించిన సంఖ్య ఇది. అలాగని ఆషామాషీగా చెప్పినదేమీ కాదు. సుమారు 78వేల మందిని పరిశీలించి.. వారి అలవాట్లు, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి పరిశోధకులు దీన్ని నిర్దేశించారు. ఇది ఉజ్జాయింపుగా 8 కిలోమీటర్ల దూరంతో సమానం. దీన్ని పూర్తి చేయటానికి దాదాపు 100 నిమిషాలు పడుతుంది. అంగల నిడివి, నడిచే వేగాన్ని బట్టి అడుగులు, సమయం అటూఇటూ అవ్వచ్చు. ఏదేమైనా నడవటం ముఖ్యం. కేవలం ఉదయం పూటే నడవాలనేమీ లేదు. రోజులో ఎప్పుడైనా అడుగులు వేయొచ్చు.
మంచి ఆరోగ్యం కోసం రోజుకు 10 వేల అడుగులు.. ఇదేం లెక్క? - నడవ వల్ల ఉపయోగాలు
రోజూ కాసేపు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఉరుకులు పరుగుల జీవితంలో తమకు టైమ్ దొరకడం లేదని చాలా మంది అంటుంటారు. కానీ రోజులో కనీసం 10వేల అడుగులు నడిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రోజుకు 10 వేల అడుగులా? ఇదేం లెక్క?
స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాలతో రోజుకు ఎన్ని అడుగులు వేశామో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇప్పుడంతా వీటితోనే లెక్కించుకుంటున్నారు కూడా. కొందరు అయ్యో.. 10వేల అడుగులు వేయ లేకపోయామే అని చింతిస్తుంటారు. అంత బాధపడాల్సిన అవసరమేమీ లేదు. ఒకో రోజు తక్కువ నడిచినా మేలే. రోజుకు 3,800 అడుగులు వేసినా మతిమరుపు (డిమెన్షియా) ముప్పు 25% వరకు తగ్గుతుంది. ప్రతి 2వేల అడుగులకు అకాల మరణం ముప్పు 10% చొప్పున తగ్గుతూ వస్తుంది. శరీరం సహకరిస్తే వేగంగానూ నడవొచ్చు. ఎంత వేగంగా నడిస్తే అంత ఎక్కువ ప్రయోజనం.