Curd Benefits For Weight Loss : జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల అనేక రకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఇంటి భోజనం కంటే క్షణాల్లో తయారయ్యే ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో వ్యాయామం కూడా చేయడం లేదు. దీని వల్ల ఊబకాయం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే బరువు పెరగడం సులువే, కానీ తగ్గడం చాలా కష్టమని గ్రహించాలి. అందుకు జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ చెమటోడిస్తే సరిపోదు.. తినే భోజనం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మెండుగా పోషకాలు
పాలు, పెరుగు, నెయ్యి లాంటి సంప్రదాయ ఆహార పదార్థాలను ఈ రోజుల్లో చాలా మంది తీసుకోవడం తగ్గించేశారు. బరువు పెరుగుతామనే అపోహ వల్ల కావొచ్చు.. వీటిని చాలా మంది రోజువారీ భోజనంలో చేర్చుకోవడం లేదు. అయితే పెరుగు లాంటి పోషకాలు ఎక్కువగా కలిగిన పదార్థాలను తరచూ భోజనంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో కార్బొహైడ్రేట్, కొవ్వు తక్కువగా ఉంటుంది. శరీరానికి బలాన్నిచ్చే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు వల్ల బరువు పెరుగుతామనే అపోహను పక్కనపెట్టాలని.. దీన్ని రోజూ తీసుకుంటే ఊబకాయం నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ నియంత్రణకు బెస్ట్
పెరుగులో కాల్షియం, ప్రొటీన్‌తో పాటు విటమిన్ బీ10, విటమిన్ బీ2, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా పెరుగులో మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్య సమస్యలను మటుమాయం చేస్తుంది. తరచూ పెరుగు తీసుకునే స్త్రీలలో వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువని పలు పరిశోధనలు చెబుతున్నాయి. పెరుగులోని పోషకాలు శరీరంలోని కణాలు నీటిని త్వరగా పీల్చుకునేలా చేస్తాయి. దీని వల్ల మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా తగ్గుతాయి. మధుమేహ నియంత్రణలో పెరుగు చక్కగా పనిచేస్తుంది.