కొవిడ్ లాక్డౌన్ సందర్భంగా కొన్ని నెలల పాటు పిల్లలకు క్రీడలు, వ్యాయామం లోపించాయి. సమీపంలో ఉద్యానం, ఆట స్థలం లేని వారు, ఇంటి వెనక పెరడు లేని పిల్లలకు బడి ప్రాంగణం మాత్రమే కొంత వ్యాయామాన్ని ఇవ్వగలదని మార్సెల్ క్యాడ్నీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారాలు చూపించటం చాలా ముఖ్యం. ఎందుకంటే బాల్యంలో చేసిన శారీరక వ్యాయామం (ఆటలు) పెద్ద వయసులో ఆందోళనను దరిచేరనీయదని పరిశోధకులు గుర్తించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కండరాలను, మెదడును బలోపేతం చేస్తాయి. మూషికాలకు చిన్న వయసులో చక్కెర, నూనె ఎక్కువ ఉన్న పదార్ధాలను ఆహారంగా ఇస్తే అవి కొవ్వెక్కి పెద్ద వయసులోనూ అటువంటి జంక్ ఫుడ్‌నే కోరుకున్నాయని పరిశోధనలు నిరూపించాయి.
ఆరోగ్యం కోసం చిరుప్రాయం నుంచే ఇలా చేయండి! - ఆందోళన
వ్యాయామం చేస్తూ పుష్టికరమైన ఆహారం లభిస్తున్న పిల్లల్లో పెద్దయ్యాక ఆందోళన వారిని బాధించటంలేదని, వారి మెదడు పరిమాణం కూడా ఎక్కువగా ఉందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. మూషికాల్లో జరిగిన అధ్యయనాల్లోనూ ఈ విషయం బయటపడింది. పిన్న వయసులో చక్కటి ఆహారం, ఆటలు.. మెదడు, కండరాల పరిమాణాన్ని పెంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫిజియాలజీ అండ్ బిహేవియర్ అనే పరిశోధనా పత్రిక కథనం ప్రకారం పరిశోధకులు ఎలుకలను రెండు బృందాలుగా విడదీసి ఒక బృందానికి వ్యాయామం లభించేటట్టు, ఆరోగ్యకరమైన ఆహారం అందేటట్టు ఏర్పాట్లు చేశారు. మరో బృందానికి కదలటానికి కూడా స్థలం లేకుండా చేసి, చక్కెర, నూనె ఎక్కువ ఉన్న పదార్ధాలను ఆహారంగా ఇచ్చారు. ఎలుకలు పుట్టినప్పటి నుంచి మూడు వారాల పాటు ఇటువంటి ఆహారాలను అందించారు. మూడు వారాలకు అవి లైంగిక పరిపక్వతను పొందిన తరువాత మరో 8 వారాల పాటు వాటికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి వాటి శరీరంలోని హర్మోన్ల స్థాయిని, కండరాల బలాన్ని కొలిచారు.
హార్మోన్లలో ఒకటైన లెప్టిన్ శరీర బరువును నియంత్రిస్తుంది. దీన్ని తయారుచేసేది కొవ్వు కణజాలం. శరీరంలో శక్తి వినియోగాన్ని లెక్కించి ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. చిన్న వయసులో శారీరక వ్యాయామ లేమి పెద్ద వయసులో లెప్టిన్ స్థాయిని నియంత్రించి ఊబకాయాన్ని కలిగిస్తున్నట్టు తెలిసింది. బాల్యంలో పిల్లల ఆటలు పెద్ద వయసులో వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం. అందువల్ల చిరుప్రాయంలో పిల్లలకు చక్కటి ఆహారాన్నందించి, అలసిపోయేంతవరకు ఆడుకోనివ్వాలి.