క్యాల్షియం ఎముకల పటుత్వానికే కాదు.. కండరాలు, నాడులు, కణాలు సజావుగా పనిచేయటానికీ అవసరమే. మన శరీరం క్యాల్షియంను తయారుచేసుకోలేదు. దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోయినా, శరీరం క్యాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. అందువల్ల వీలైనంత వరకు క్యాల్షియం నిల్వలు పెరిగేలా చూసుకోవాలి. ముఖ్యంగా 35 ఏళ్లకు ముందే దీన్ని సాధించాలి. ఎందుకంటే ఎముక సాంద్రత 25-35 ఏళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గుతూ వస్తుంటుంది.
హార్మోన్లు సజావుగా పనిచేయటానికి క్యాల్షియం కావాలి. ఇవి రోజూ ఎముకల నుంచి కొంత క్యాల్షియాన్ని తీసుకుంటూ రక్తంలో క్యాల్షియం మోతాదులు నిలకడగా ఉండేలా చూసుకుంటాయి. ఇది ఎముక క్షీణతకు దారితీస్తుంది. కాబట్టే వయసు పెరుగుతున్నకొద్దీ క్యాల్షియం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం మంచిది. పాలు.. పెరుగు, మజ్జిగ, పన్నీరు, ఛీజ్ వంటి పాల పదార్థాలు.. పాలకూర వంటి ఆకు కూరలు.. సాల్మన్, సారడైన్ వంటి చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాల్షియం లభించేలా చూసుకోవచ్చు. అవసరమైతే మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది. మనకు రోజుకు కనీసం 1200 మి.గ్రా. క్యాల్షియం అవసరం. అలాగే 800 నుంచి 1,000 విటమిన్ డి కూడా కావాలి. శరీరం క్యాల్షియాన్ని గ్రహించుకోవటానికి తోడ్పడేది విటమిన్ డినే.