రుజుతా దివేకర్.. ముంబయికి చెందిన ఈ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు.. కరీనా కపూర్, అలియా భట్‌తో పాటు పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు సూచిస్తుంటారు. అంతేకాదు.. కరీనా గర్భంతో ఉన్నప్పుడు చక్కటి ఆహార నియమాలు సూచించడం, ప్రసవానంతరం ఆమె కొన్ని రోజుల్లోనే తిరిగి బరువు తగ్గి ఫిట్‌గా మారడంలో రుజుత డైట్ ప్లాన్ ఎంతో కీలకం అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని కరీనా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకే కాదు.. మనలాంటి సామాన్యులకు సైతం ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, సీజన్‌ను బట్టి వివిధ రకాల పదార్థాలు-వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యాయామాలు.. వంటివన్నీ సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు రుజుత. అలా తాజాగా బనానా ఫ్లోర్-అందులో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్.
పండే కాదు.. ఇవీ తీసుకోవాలి!
అరటి పండు.. అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే పండు. విటమిన్ 'సి'తో పాటు పొటాషియం, మాంగనీస్.. వంటి ఖనిజాలు నిండి ఉన్న ఈ పండును తినడం అటు ఆరోగ్యానికి, ఇటు అందానికీ ఎంతో మంచిది. అయితే దీన్ని కేవలం పండు రూపంలోనే కాకుండా అరటికాయ, అరటి పువ్వు, అరటికాయతో తయారుచేసిన పిండి (బనానా ఫ్లోర్).. వంటివి తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు రుజుత. ఈ క్రమంలో బనానా ఫ్లోర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారామె. తన తల్లి రేఖా దివేకర్ బనానా ఫ్లోర్‌తో తయారుచేసిన థాలీపీట్ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న రుజుత.. ఈ పిండిని ఎలా తయారుచేసుకోవాలి, థాలీపీట్ తయారీ, బనానా ఫ్లోర్‌లో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి సుదీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చారు.
సంతానోత్పత్తి కోసం..
బనానా ఫ్లోర్ థాలీపీట్ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న రుజుత.. "బనానా ఫ్లోర్‌తో మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా..
- ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే మన మనసును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరిస్తుంది.
- స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
- రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
- జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
- పేగుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
- హార్మోన్లను నియంత్రించడంలో సహకరిస్తుంది.
ఈ బనానా ఫ్లోర్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. మనందరి వంటింట్లో ఉండే అతి ముఖ్యమైన పదార్థం. అంతేకాదు.. ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అరటికాయ ముక్కల్ని రెండుమూడు రోజులు ఎండలో బాగా ఎండబెట్టి దీన్ని తయారుచేసుకోవచ్చు. అలాగే ఈ పిండితో థాలీపీట్ తయారుచేయడం కూడా ఈజీనే! ఆ రెసిపీని మా అమ్మ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. తక్షణ శక్తిని, సంతానోత్పత్తిని పెంచే ఈ పిండిని మీరూ తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే అరటికాయ, పండ్లు, అరటి పువ్వు.. వంటివి కూడా క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.." అంటూ చెప్పుకొచ్చారీ న్యూట్రిషనిస్ట్.
బనానా ఫ్లోర్ ఎలా తయారుచేయాలి?