వృద్ధాప్యం త్వరగా మీద పడొద్దని కోరుకుంటున్నారా? అయితే సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం మీదే కాదు.. మద్యం అలవాటుంటే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. మద్యం వృద్ధాప్య ప్రక్రియ మీద చాలా రకాలుగా ప్రభావం చూపుతుంది మరి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆయా అవయవాలను, మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇలా త్వరగా వృద్ధాప్య ఛాయలు ముంచుకొచ్చేలా చేస్తుంది.
నీటిశాతాన్ని తగ్గిస్తూ..
కారణమేంటో స్పష్టంగా తెలియదు గానీ వయసు మీద పడుతూ వస్తున్నకొద్దీ ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. దాహం వేయటమూ తగ్గుతుంటుంది. అందుకే వృద్ధులకు శరీరంలో నీటి శాతం తగ్గే ముప్పు ఎక్కువ. దీనికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఎందుకంటే మద్యం ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. శరీరంలో నీరు తగ్గితే నీరసం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. ముఖకళ కూడా తగ్గుతుంది.
చర్మాన్ని పొడిబారిస్తూ..
వయసు మీద పడుతున్నకొద్దీ మన చర్మం పలుచగా అవుతుంది. పొడిబారుతూ వస్తుంది. చర్మం కింద కొవ్వు తగ్గుతూ వస్తుంది. ఇది ముడతలు పడటానికి దారితీస్తుంది. ఇదంతా సహజంగా జరిగేదే. దీన్నే అంతర్గత వృద్ధాప్య ప్రక్రియ అంటారు. అయితే ఇదొక్కటే కాదు.. చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం, జీవనశైలి వంటి బయటి అంశాలతోనూ చర్మం ముడతలు పడొచ్చు. మద్యం మూలంగా ఒంట్లో నీటిశాతం తగ్గి, చర్మం ముడతలు పడటం మరింత ఎక్కువవుతుంది.
కీలక అవయవాలను దెబ్బతీస్తూ..
మద్యంతో కాలేయం గట్టిపడే (సిరోసిస్) ముప్పు ఎక్కువ. ఒక మాదిరిగా తాగినా కాలేయం మీద విపరీత ప్రభావం చూపుతుంది. కాలేయానికి కొవ్వు పట్టటం వంటి సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీల పనితీరునూ దెబ్బతీస్తుంది. ఇలాంటి కీలక అవయవాల సామర్థ్యం మందగిస్తే వృద్ధాప్య సమస్యలు ఇంకాస్త త్వరగా దాడిచేస్తాయి.
మెదడును మొద్దుబారుస్తూ..
వేసే ప్రతి మద్యం గుటక నేరుగా మెదడులోకి వెళ్తుందన్నా అతిశయోక్తి కాదు. దీర్ఘకాలంగా అతిగా మద్యం తాగితే మెదడు కణాలు కుంచించుకపోయే ప్రమాదముంది. మద్యంతో ముడిపడిన మెదడు క్షీణతకు దారితీస్తుంది. కొన్నిరకాల డిమెన్షియాకూ కారణమవుతుంది. దీంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం, పనుల్లో క్రమబద్ధత లోపించటం, ఏకాగ్రత కుదరకపోవటం, భావోద్వేగాలపై పట్టు తప్పటం, కోపం రావటం వంటి లక్షణాలు పొడసూపుతాయి.