కరోనాతో అల్లాడుతున్న దేశ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసేలా వరుసగా వ్యాధులు విరుచుకుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బ్లాక్ ఫంగస్ వెలుగులోకి రాగా.. ఇటీవలే వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అసలు ఈ ఫంగస్‌లు ఏంటి? ఎందుకు ఇలా విజృంభిస్తున్నాయి?
ఏంటీ ఎల్లో ఫంగస్?
ఎల్లో ఫంగస్‌ను మ్యుకోర్సెప్టికస్ అని కూడా అంటారు. ఎల్లో ఫంగస్ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుంది. ఈ ఫంగస్ ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించకపోతే శరీరంలో మరింతగా వ్యాపిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి-అధిక యాంటీబయాటిక్సే బ్లాక్ ఫంగస్‌కు కారణం!
ఎల్లో ఫంగస్ లక్షణాలు
- విపరీతమైన నీరసం
- ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం
- క్రమంగా బరువు తగ్గిపోవడం
- తీవ్రత ఎక్కువగా ఉంటే లక్షణాలు
- గాయాలు త్వరగా తగ్గకపోవడం
- గాయాల నుంచి చీము కారడం
- శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం
- కళ్లు పీక్కుపోవడం
నివారణ ఎలా?
ఎల్లో ఫంగస్ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమం. ఎల్లో ఫంగస్ చికిత్సకు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ అందుబాటులో ఉంది.
బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్‌ను మ్యూకోర్మైకోసిస్ అని అంటారు. మధుమేహం ఉన్న వారు కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా సోకుతుంది. చక్కెర నిల్వలు అధికంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో దీని ముప్పు ఎక్కువ. కేన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు, ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారికీ ముప్పు ఎక్కువే.
ఇదీ చదవండి-'బ్లాక్ ఫంగస్ అంటే భయం వద్దు కానీ..'
బ్లాక్ ఫంగస్ లక్షణాలు
- సైనసైటిస్-ముక్కుదిబ్బడ, నలుపు రంగులో ముక్కుకారటం, దవడ, చక్కిళ్లు నొప్పి
- మొహంపై ఒక వైపు నొప్పి, తిమ్మిరి, వాపు
- ముక్కుదూలంపై, అంగళిపై నలుపు రంగు
- పంటి నొప్పి, వదులు పళ్లు, దవడ నొప్పి
- అస్పష్ట కంటి చూపు, నొప్పి, జ్వరం, చర్మంపై పుండ్లు
- ఛాతీలో నొప్పి, దగ్గితే రక్తం, ఆయాసం