చక్కెరలో యూరియా? కూరగాయలపై కెమికల్స్? కల్తీని గుర్తించండిలా...
Adulteration testing: మార్కెట్లో దొరికే కూరగాయలు, దుకాణాల్లో దొరికే కిరాణ సామగ్రిని మనం పైపైన చూసి కొనుగోలు చేస్తుంటాం. అయితే మన కళ్లు మనల్ని మోసం చేయొచ్చు. చూడటానికి బాగానే ఉన్నా.. ఆ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉండొచ్చు. అన్ని ఆహార పదార్థాలూ కల్తీ బారిన పడుతున్న నేపథ్యంలో.. వాటిని కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Food Adulteration India
మరి మంచివేవో, కల్తీవేవో తెలుసుకొనేది ఎలా అంటారా? ఇది తెలుసుకునేందుకే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఓ సింపుల్ టిప్స్‌ను షేర్ చేసింది. వివిధ ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో వివరించింది.
కూరగాయల్లో మలకైట్ గ్రీన్!
వస్త్ర పరిశ్రమలో రంగులు అద్దేందుకు ఉపయోగించే మలకైట్ గ్రీన్ ఆనవాళ్లు కూరగాయల్లో కనిపిస్తున్నాయి. మిరపకాయలు, బఠానీలు, బచ్చలి కూర వంటివి ఆకుపచ్చగా, ఆకర్షణనీయంగా కనిపించేలా దీన్ని వాడతారు. అయితే, ఈ మలకైట్ గ్రీన్ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
Vegetables with malachite green
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. సమయం, ఉష్ణోగ్రత తదితర కారణాలను బట్టి ఈ మలకైట్ గ్రీన్.. ప్రమాదకరంగా మారుతుంది. ఇది శరీరంలోకి వెళ్తే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పిండం సరిగా పెరగకపోవడం, క్రోమోజోములు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో కల్తీపై అవగాహన కల్పించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేసింది.
మలకైట్ గ్రీన్ గుర్తించడం ఎలా?
- కొంచెం దూదిని తీసుకొని పారాఫిన్ ద్రావణంలో నానబెట్టాలి.
- బెండకాయపై దూదితో రుద్దాలి.
- రంగులో ఎలాంటి మార్పు లేకపోతే కల్తీ జరగలేదని అర్థం.
- దూది ఆకుపచ్చ రంగులోకి మారిపోతే కల్తీ జరిగినట్లే.
పప్పులు కల్తీ అయ్యాయా?
- పప్పు ధాన్యాల విషయంలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే..
- ముందుగా పప్పు ధాన్యాలను ఓ గ్లాస్ ప్లేట్లోకి తీసుకోవాలి.
- పప్పు ధాన్యాల్లో నల్లటి ఉమ్మెత్త గింజలు కనిపిస్తే అది కల్తీ అయినట్టు.
- పప్పు ధాన్యాల్లో ఎలాంటి నల్లటి గింజలు లేకపోతే కల్తీ జరగలేదని అర్థం.
చక్కెరలో యూరియా?
- చక్కెరలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కల్తీని గుర్తించడం గురించి తెలుసుకోండి..
- ముందుగా టీస్పూన్ చక్కెరను గ్లాసు నీటిలో కలపాలి.
- చక్కెర పూర్తిగా కరిగే వరకు కలపాలి.
- ఆ చక్కెర ద్రావణం నుంచి అమోనియా వాసన వస్తే కల్తీ జరిగినట్టు.
- వాసన ఏమీ రాకపోతే కల్తీ జరగలేదనే అర్థం.
లవంగాలు అసలైనవా కల్తీవా తెలుసుకోండిలా...
శనగపిండిలో కేసరి పప్పు పిండిని కలిపారా? ఈ పరీక్ష చేసి గుర్తించండి..
ఇదీ చదవండి: