22 Minutes Of Exercise A Day Benefits:ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పని చేసే వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఊబకాయం, గుండెజబ్బులు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది ఇటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మాథ్యు అహ్మదీ, ఇమ్మాన్యుయేల్ స్టామాటాకీస్, సిడ్నీ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా చేసిన ఓ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 50 ఏళ్లు పైబడిన వారు 22 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల అకాల మరణాలను తగ్గించవచ్చని తాజాగా వారి పరిశోధనలో తేలింది. చిన్న చిన్న వ్యాయామాల వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.
12 వేల మందిపై అధ్యయనం..
నార్వే, స్వీడన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం స్వీడన్, అమెరికాలోని 50 ఏళ్లు పైబడిన 12వేల మందిపై ఈ అధ్యయనం చేశారు. శారీరక వ్యాయామం చేస్తున్న వారికి , చేయని వారికి మధ్య ఆరోగ్యపరమైన తేడాలు గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు రోజువారీ దినచర్యలను పరిగణనలోకి తీసుకున్నారు. వారు ఎంత సేపు స్థిరంగా ఒకచోట కూర్చున్నారో.. ఎంత చురుకుగా ఉంటున్నారో తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు వారికి అమర్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారి ఆరోగ్య పరిస్థితి, వ్యాయామం ఎంతసేపు చేస్తున్నారనే విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.
అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్న అంశాలు
విద్యా నేపథ్యం, మద్యపానం, ధూమపానం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి అనేక జీవనశైలి ఆరోగ్య కారకాలను పరిగణనలోకి తీసుకున్నారు. అధ్యయన వివరాలను జాతీయ మరణ రిజిస్ట్రీకి అనుసంధానించారు. మెట్లు ఎక్కడం, పచ్చికను కత్తిరించడం, మనం ఇంట్లో చేసే చిన్న పనులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అధ్యయనంలో తేలిన అతి ముఖ్య విషయం ఏంటంటే.. చిన్న వ్యాయామాలు కూడా సానుకూల ఫలితాలు ఇవ్వడం.