యావత్ దేశాన్ని ఆకర్షించేలా కృష్ణశిలతో పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మహాకుంభ సంప్రోక్షణ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో భక్తులు గోదావరి జలాలతో పుణ్యస్నానం ఆచరించేలా పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తలంపుతో యాడా ఈ చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జగదేవ్‌పూర్ నుంచి బస్వాపూర్ జలాశయానికి వచ్చే కాల్వపై 40 కిలోమీటర్ల వద్ద సైదాపూర్ కాల్వ నిర్మించారు.
ఈ కాల్వపై 8.5 కిలోమీటర్ల వద్ద ఎలాంటి వరద నీరు కలవకుండా రూ.2 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా పైపులైన్ వేస్తున్నారు. దీని ద్వారా యాదాద్రి దిగువన ఉన్న గండి చెరువును గోదావరి జలాలతో నింపుతారు. అక్కడి నుంచి చెంతనే ఉన్న లక్ష్మీ పుష్కరిణి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు పంపుతారు. ఇలా నిరంతరం శుద్ధమైన గోదావరి జలాలతోనే భక్తులు పుణ్యస్నానాలు చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలోపు పనులు పూర్తయ్యేలా యాడా పనులను వేగవంతం చేసింది.