Yadadri Hundi Counting: యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గత 20 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కోటి 84 లక్షల 84వేల 891రూపాయలు నగదను భక్తులు కానుకుల రూపంలో నరసింహ స్వామికి సమర్పించారని పేర్కొన్నారు. నగదుతో పాటు 144 గ్రాముల బంగారం, 2 కిలోల 850 గ్రాముల వెండి సమర్పించారు. హుండీల్లో విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్టు తెలిపారు. వాటిలో అమెరికా దేశానికి చెందిన 1024 డాలర్లు, యూఏఈ 210 దిరామ్స్, ఆస్ట్రేలియా 145 డాలర్స్ ఇతర దేశాల కరెన్సీ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
రథసప్తమి వేడుకలు: యాదాద్రిలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచనారసింహుల సన్నిధిలో తొలిసారిగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. వేడుకల నిర్వహణ కోసం సూర్యప్రభ ఆసనం, రథాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్వామి ఊరేగింపు కోసం ఇప్పటికే సూర్య ప్రభ వాహనాన్ని సిద్ధం చేయగా.. మరోవైపు ఆలయ ప్రాకార మండపాలు, మాడ వీధులు శుద్ధి ప్రక్రియ చేపడుతున్నారు.
ఆలయ వార్షిక అధ్యయణోత్సవాలు: అంతేకాకుండా క్షేత్రానికి కొండకింద అనుబంధ పాతగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక అధ్యయణోత్సవాలు ఈ నెల 27న మెదలై.. 30 వరకు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. వైష్ణవ ఆలయాలలో ప్రతిఏటా సంప్రదాయంగా నిర్వహించే నాలుగు రోజుల అధ్యయనోత్సవాలలో ప్రబంధ పఠనం, అలంకార పర్వాలను చేపడతారు.