యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి (YADADRI sri lakshmi narasimha swamy) క్షేత్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ద్వారాలకు తాపడం, దర్శన వరుసల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాన ఆలయ తొలి ప్రాకారంలోని ఉత్తర దిశ ద్వారానికి... ఆర్కిటెక్ట్ ఆనందసాయి పర్యవేక్షణలో ఇత్తడి తొడుగులు(Brass gloves) బిగిస్తున్నారు. పెంబర్తి కళాకారులతో తొడుగులు తయారు చేయించారు.
వారంలోగా పనులు పూర్తి
ఆధ్యాత్మిక, ఆహ్లాదం కలిగేలా.. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) సూచనలతో బంగారు వర్ణంతో.. దర్శన వరుసలకు మందిర రూపమిస్తున్నారు. వారంలోగా పనులు పూర్తి చేస్తామని ఆనంద్ సాయి వెల్లడించారు.. ప్రధాన ఆలయ రక్షణ గోడకు రంగులద్దే పనులు ముమ్మరం చేశారు. కృష్ణ శిల నిర్మాణాలకు తగ్గట్లుగా రక్షణగోడలకు అదే రూపం వచ్చేలా రంగులు వేస్తున్నారు. రాజస్థాన్ జయపుర నుంచి తెప్పించిన ఐరావత ప్రతిమలను అమరుస్తున్నారు.
హైందవ సంస్కృతి చాటేలా...
ఎక్కడా లేని తరహాలో అల్యూమినియం, ఇత్తడి కోటింగ్‌తో వాతావరణానికి అనుగుణంగా స్వామి దర్శన వరుసల సముదాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచ నారసింహుల దివ్య దర్శనం కోసం వెళ్లే భక్తులకు హైందవ సంస్కృతిని చాటేలా వైష్ణవ చిహ్నాలతో సిద్ధమవుతోంది. మరో వారంలోగా ఈ పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: స్వర్ణ వర్ణ శోభితమయం
భవన సముదాయ విస్తరణ పనులు
భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్ భవన సముదాయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు కొండపై అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు యాడా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. క్షేత్ర సందర్శనకు వచ్చిన యాత్రికులు ఆలయానికి చేరే దశలో ముందస్తుగా వేచి ఉండేందుకు ప్రత్యేక సముదాయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. వాస్తు రీత్యా ఆ సముదాయాన్ని విస్తరించాలని యాడా నిర్ణయించింది. ఆ మేరకు విస్తరణ పనులను చేపట్టినట్లు ఈఈ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.